#


Index

చిత్రతరంగిణి

శివుడా విష్ణువా అని మూర్తిభేదం గాని పంచాక్షరా అష్టాక్షరా అని నామభేదం గాని షోడశోపచారాది క్రియాకలాపంగాని ఉండబోదు. పైగా అకాశంలాగా వ్యాపించినా అది జడం గాదు. సాధకుడి భావనతో కూడుకొన్నది. కాబట్టి జ్ఞానస్వరూపం. జ్ఞానమనే సరికి దానికొక జ్ఞేయమైన పదార్థముంటుంది. మరి దీని కలాంటి జ్ఞేయపదార్థ స్పర్శకూడా లేదు. ఉంటే నామరూపాత్మకమైన జ్ఞేయ ప్రపంచమంతా దానిలో కరిగిపోయి తదాత్మకంగా భాసించవలసిందే. అసలీ ప్రపంచమంతా తద్భిన్నంగా ఎప్పుడూ లేదనే గదా సిద్ధాంతం కేవలమూ మన అవిద్యాదోషం వల్లనే కనిపిస్తుందాయె. సమష్టి భావనా బలంతో అవిద్యాగ్రంథి ఎపుడు సడలిపోతుందో అప్పుడీ జ్ఞేయ జగత్తు కూడా జ్ఞానంగానే భాసిస్తుంది. అలా భాసించిన నాడిక మనకు బాహ్యంగా ప్రపంచమూ లేదు. మన ఈ శరీరాది సంఘాతమూ లేదు.

  అంతేకాదు. ఈశ్వరుడు కూడా మనకు బాహ్యంగా ఎక్కడో ఉండబోడు. ఉంటే ప్రపంచంలాగా మన జ్ఞానానికీ జ్ఞేయం కావలసివస్తుంది. జ్ఞేయమైతే నామరూపాది విశేషాలు వచ్చిపడతాయి. అప్పుడా ఈశ్వరుడు కూడా ప్రపంచంలో ఒక భాగమేనని చెప్పవలసివస్తుంది. మరి ప్రపంచానికి విలక్షణుడు కదా ఈశ్వరుడు. ప్రపంచమే ఎలా అవుతాడు. ప్రపంచ మాయన విభూతి కావలిసిందే దాని స్వరూపం కానేరదు. స్వరూపం పరిశుద్ధమైన చైతన్యమే. కనుకనే ప్రజ్ఞానమ్ బ్రహ్మ అని వర్ణించిం దుపనిషత్తు. ఆ ప్రజ్ఞానం మన మీ ప్రపంచాన్ని చూస్తున్నంత సేపూ పరిచ్ఛిన్నమై మనకతీతంగా ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది. మరలా ఇదంతా మన జ్ఞానంలో లయమై జ్ఞానైక రసంగా ఎప్పుడనుభవానికి వచ్చిందో అప్పుడీ జీవచైతన్యాని కుపాధులనే ఆనకట్టలు తెగిపోయి అదే మనకఖండమైన చైతన్యంగా సాక్షాత్కరిస్తుంది. అంటే సర్వత్రా సర్వదా సర్వమూ వ్యాపించి సచ్చిద్రూపంగా నాకు నేను ఉన్నాను - మరేది లేదనే ఒక అద్వితీయాత్మ చైతన్య స్ఫూర్తి ఏర్పడుతుందని అర్థం.

  ఇదిగో అలాటి నిష్ప్రపంచ బ్రహ్మాత్మ భావన ఏదైతే ఉన్నదో అదే యథార్థమైన అద్వైత జ్ఞానం. ఈ జ్ఞాన మావిర్భవించటానికి ముందున్న జ్ఞానం కేవల మాభాస రూపమైన జ్ఞానం మాత్రమే. అయితే ఆ ఆభాస జ్ఞానాన్ని పురస్కరించుకొనే భక్తి అనేది ఏర్పడింది. ఆ భక్తి ముదిరి పాకానబడి క్రమంగా ఈ వాస్తవిక జ్ఞాన

Page 71

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు