#


Index

చిత్రతరంగిణి

వరమీవో కర్మమా. అంతేకాదు. అది సాధించటాని కప్పుడప్పుడూ మానస బోధ చేసుకోమని బోధిస్తాడు. ఆయన చెప్పిన మానస బోధలూ విషయ దూషణలూ వైరాగ్య భాషణలూ - కొన్ని వందలున్నాయి. అవన్నీ అద్వైత భావాలకు వేసిన చక్కని పూల బాటలే.

  కాబట్టి అన్నమయ్య భక్తిని ప్రపంచిస్తున్నా- శరణాగతి చెబుతున్నా భక్తి అద్వైతుల అనన్య భక్తి. ఆ శరణాగతి అద్వైతుల జ్ఞాన పూర్వక శరణాగతే. తుదకు అన్నమయ్య ఆరాధించే వెంకటేశ్వరుడు కూడా నిజానికి వైష్ణవ దేవుడు కాడు. సగుణ నిర్గుణాల కతీతమైన తత్త్వమది. గరమ గొందరికి సాకారమై నిలిచితి గురు నిరాకారమై కొందరికి వరుస గొందరికెల్లా సగుణుడవట నీవు - ధర నిర్గుణుడవట తగిలి కొందరికి. సగుణ నిర్గుణాలు కొందరికేనట. మరి తన సంగతేమిటని అడిగితే జవాబిస్తా డన్నమయ్య. ఇది యది యననేల ఇంతయును నీ మహిమ - కలసి నీ పాదాల కనుగొంట గాక. అంతా భగవద్విభూతి అని గుర్తించి ఆయన పాదాలు సేవించటమే కర్తవ్యమట. ఇక్కడ గుర్తించటం జ్ఞానమైతే సేవించటం భక్తి. జ్ఞానపూర్వకమైన భక్తి. ఇదే అనన్య భక్తి. పాదాలంటే నామరూపాలే. పద్యతే ఆభ్యాం పరమాత్మనః తత్త్వమితి పాదౌ. నామరూపాలే పరమార్థాన్ని చేర్చే సాధనాలు. అసతో మా సద్గమయ అని గదా సిద్ధాంతం..

  ఇలా ఎంతని చెప్పమంటారు. ఎంతెంత దిగి చూస్తే అంతంత లోతుకు తీసుకెడుతుంది అన్నమయ్య ఆధ్యాత్మ తత్త్వం. అద్వైత భావం బాగా జీర్ణించుకొన్న విశిష్టాద్వైతి అతడు. కేవలా ద్వైతి లాగా శుష్క జ్ఞాని కాడు. కేవల విశిష్టాద్వైతి లాగా మార్జాల భక్తుడూ కాడు. జ్ఞాన వైరాగ్యాలనే రెండు తటాలనూ ఒరసికొని పారే ప్రవాహంలాంటి భక్తి ఆయనది. అదే నిఖారసైన భక్తి అసలు. తేషాం జ్ఞానీ నిత్య యుక్తః ఏక భక్తిః విశిష్యతే. జ్ఞాని నిత్య భక్తుడూ నిత్య ముక్తుడూ. అంటే కర్మ యోగ, సమాధి యోగ, భక్తి యోగాలు మూడూ జ్ఞానికే లభిస్తాయి గాని మరెవ్వరికీ దక్కబోవని భగవానుడి తీర్మానం. ఈ విశ్వసూత్రాని కక్షరాల కట్టుబడ్డ పవిత్ర జీవితం అన్నమయ్యది. ఆయన జీవిత పారావారంలో నుంచి ఆవిర్భవించిన అమృత భాండం ఆయన ఆధ్యాత్మ వాఙ్మయం. అది ఇలా ఉన్నదలా ఉన్నదని వర్ణించటానికి మన మెవరం. మౌనంతో తనివితీర ఆస్వాదించటమే మనకు వరం.

Page 59

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు