#


Index

చిత్రతరంగిణి

ఏమిసేయగ వచ్చు నిక నివెల్లా నా నేరములే దీమసాన లోలోనే తెలుసుకో నైతి

  అని ఒక కీర్తన. ఇది నాయిక నిర్వేదాన్ని బయటపెడుతుంది. ఆ నిర్వేదంలో పైకి శృంగార భావ మెంత కనిపిస్తుందో లోపల ఆధ్యాత్మ భావమంతగా ప్రవహిస్తున్నది. అన్నీ నా నేరాలే - గర్వంతో గ్రహించలేక పోయానని వాపోవటం శృంగార నాయికే గాదు. పరమార్థాన్ని గుర్తించలేక జీవితమంతా వ్యర్థంగా గడపిన జీవుడు కూడా.

చెప్పెగా నీ గుణాలెల్లా - చెలియ నాతో నాడె మెప్పున నీ సేవ సేయ నేరనైతి

  గురువులెంత బోధించినా ఎంత శ్రవణం చేసినా ప్రపత్తికి వెంటనే సంసిద్ధుడు కాలేడు మానవుడు.

వొప్పగించగా నీ వుంగరము నాచేతికి చొప్పులవి సోధించి చూడ నైతి

  భగవద్విభూతిని గుర్తుకు తెచ్చే చిహ్నాలెక్కడబడితే అక్కడ ఉన్నాయి సృష్టిలో. నిజానికి సృష్టి అంతా భగవత్తత్వానికొక గొప్ప సంకేతమే. ఉంగరాన్ని బట్టి దాన్ని ధరించే వ్యక్తి గౌరవాన్ని ఊహించినట్టే సృష్టి రహస్యాలను బట్టే భగవత్తత్వాన్ని శోధించి చూడవచ్చు. కాని అలాంటి యోగ్యతకు నోచుకోలేని అభాగ్యుడీ మానవుడని ఇందులో ధ్వని. చూడబోతే నాయక సమాగమాన్ని అభిలషించే విరహిణి విలాపమా లేక పరమాత్మ సాయుజ్యాన్ని కాంక్షించే సాధకుని పరితాపమా ఇది. ఏదైనా కావచ్చునని తోస్తుంది. మరో కీర్తన చూడండి.

ఆనతియ్య వయ్యా నిన్ను - నడిగేము చెలులము ఆనుక నీ నీతులకు నరుదయ్యీ మాకు

  నాయిక విషయంలో నాయకుడు చూపే వన్నీ కల్లలో నిజాలో తెలియదంటారు చెలికత్తెలు. నాయకుడిక్కడ వేంకటేశ్వరుడే. ఆయన విషయం కూడా అలాంటిదే. ఆయన నటనలు అల్పజ్ఞులైన జీవుల కర్ణం కానివే నిజానికి.

Page 53

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు