పనిచె వసిష్ఠ ముఖ్యులగు వారిని బిల్వ సుమంత్రు - నాతడుం జని కొని తేర ఋశ్యముని సత్తము డూతగ నశ్వమేధమున్ తనరగ జేయువాడ మఱి దానికి మీరును భారవాహులై నను కృతకృత్యు జేయుడనినన్ నృపుజూచి
వసిష్ఠు డిట్లనెన్ భవదభిమత మిది భూవర - అవితథ మగు ఋశ్యశృంగు నంతటి వాడీ సవనంబు నిర్వహింపగ నవునే భావింప నన్యథా మనకనుచున్
ద్విజుల కర్మాంతికుల శిల్ప విదుల గణక ఖనకులను వర్ధకుల నాట్య కల్ప విదుల నెల్లవారల బిలిచి మీరెల్ల రాజ శాసనము నప్రమత్తులై సలుపవలయు
ఇష్టకంబులు కూర్పుడీ సహస్రంబులు కట్టింపుడీ యౌప కార్యములను బ్రాహ్మణా వసధము ల్రచియింపుడీ భోజ్య పానీయములకు లోపంబులేక కరితురంగమ శాల లిరవుకొల్పుడి దేశ దేశాగతులు జనాధీశులకును విడిది పట్టులను గావింపుడీ బహువిధ గ్రామ పట్టణ సమాగతులకెల్ల
అన్న వస్త్రా శ్రయముల కావంతయైన కొరత లేకుండ పరిచర్య నెరప వలయు సకల వర్ణంబులకు పేద సాదలకును పరమ సంతృప్తి గలుగు నట్లరయ వలయు
వారట్టుల చేయుదుమొక - నేరమి వాటిల్ల కుండ నెరపుదు మనినన్ ధీరుడు వసిష్ఠు డంతట - చేరి సుమంత్రునకు నిట్లు చెప్ప దొడంగెన్
Page 47