#


Index

చిత్రతరంగిణి

ఆ రాజన్యుడు ప్రమద - స్మేరాననుడై యమాత్య శేఖరులను దా జేర బిలిచి గురువాగను సారముగా వారి నిట్లు సలుపగ బంచెన్

సంభారముల నెల్ల సమకూర్పు డశ్వంబు విడువబంపుడు సమర్థుడు వహింప సరయు వుత్తర తీర ధరణి యజ్ఞోచిత భూమిగా నిర్మింప బూనుకొనుడు

కల్పోక్త విధి కనుగలముగా సకలమౌ శాంతి కర్మము లెల్ల సలుప వలయు యాగ మీయది సేయ నర్హులందరు రాజు లటుగాన నంతరాయములు గలుగు

అరయుచుందురు విద్వాంసులైన బ్రహ్మ రాక్షసులు యాగ విషయ రంధ్రముల నెపుడు కనుక మఖమిది విగుణంబు గాని యట్టు లప్రమత్తత మీరెల్ల నరసి కొనుడు అనిన సుమంత్రు డేకాంతమున భూకాంతునితోడ నిట్లనియె

ఇది నాకు నితఃపూర్వమె విదితము ఋత్విజుల వలన వింటిని ఋషి సం సదమున సనత్కుమారుడు - మొదటనే వచియించె నీదు పుత్ర విషయమై

కలడు విభండకుం డనగ కశ్యపు పుత్రు డొకండు - వానికిం గలుగును ఋశ్యశృంగుడనగా నొక నందను - డావన స్థలమును తాతపాదులను తక్క మరొక్క టెరుంగ బోవ డ స్ఖలితపు బ్రహ్మచర్యమున కాలము పుచ్చుచు నుండు నిచ్చలున్

ఆ కాలంబున రోమపాదుడను వా డంగావనీ నాథుడై సాకున్ భూప్రజ - వాని రాజ్యమున దోషంబేమొ దుర్భిక్ష మ ఱ్ఱాకం బెట్ట దొడంగె లోకుల తదీయా ఘాతమున్ సైప కా భూకాంతుండు మహీసురోత్తముల సంబోధించి తానిట్లనెన్

Page 42

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు