జాగా యొక్కెడ లేని వాని కగుబో జాగా సమస్తంబు - నే పాగీ చేరిన రాత్రియౌ నదియపో వాసంబు విశ్రాంతి కే భోగం బక్కర లేకయున్న నఖిలంబున్ తోచు భోగ్యంబుగా బాగా దీని యథార్థమున్ తెలియుటే భాగ్యంబు దర్వేశికిన్
పెద్దల శిక్ష - ఆత్మ సమవేక్షణ - నీయెడ గల్గేనేని నీ వొద్దిక నెల్లవారు తలలూపగ నెంతగ మాటలాడినన్ ముద్దుగ నుండు - లేని యెడ మూర్ఖత చాటుట కంటె మాటయన్ సుద్దియె మాని మౌనివయి శోభిలు జంతు గణంబు పోలికన్
గొప్ప ప్రయోజనంబు నొడ గూర్చెడుచో నొక పల్కు పల్కగా నొప్పును గాని రేబవలు నూరక వాగుటగా- దెడందలో నెప్పుడు దాగియుండు గణియింప సముజ్జ్వల మౌన భాష నీ వెప్పటి కఫ్టు వాగి కుదియింపగ జూతువు దాని సోదరా
ఒయీ! కోయిల పాటగాడ! పరకీ యోత్సాహివై యేవియో గేయంబుల్ తెగ పాడుచుండెదవు కోర్కెల్ నీకు మాధ్వీరసా ప్యాయంబైన సుమంబు పైనె గద మాకన్నన్ తదాచార్యక ప్రాయంబైన సుమాంగిపైనె నిలుచున్ ప్రాణంబు ప్రాణంబుగన్
అదె దూరంబున కుక్కుటారవము నీవాలించితో లేదా - నీ నిదురన్ మాని శిరంబు మావలెనె పై నిల్పంగదే యంచు నీ కది సందేశము - నింగి నేలయను తేడా లేక కన్పట్టు చు న్నది యెల్లన్ ప్రభు పాద ముద్రియని యంతర్దృష్టి నీక్షింపుమా
ఎదుటన్ గన్పడవచ్చు నీ కనులకున్ హేరాళమై సాగరం బుదితార్క గ్రహతారకా శబలితం బుద్దామమై యాకసం బిదియెల్లన్ గణుతింప నొక్క కణమా ఈశ స్వరూపంబులో నది యర్థం బిది దాని దెల్పు నొక బాహ్యంబైన శబ్దంబగున్
Page 36