#


Index

చిత్రతరంగిణి

వేంకటేశ్వరా

శ్రీకర మైన వేంకట గిరిన్ ప్రభవించి రమా తటిత్ప్రభా లోకము పైని బర్వ - నుతి లోల వసిష్ఠ శుకాది చాతకా నీకము చేరి కొల్వ - కమనీయ దయారస ధార మా తపో ద్రేకము మాన్పవేన్ ఘనత దెచ్చునె నీకది వేంకటేశ్వరా

కృతమును త్రేత ద్వాపరము కీడ్పడ - మీదికి పొంగె నేటికీ క్షితి కలికాల పాపఝరి - శీఘ్ర పరచ్చల దుగ్ర వాశ్చటా ప్లుతమయి పోయె మానవు లపూర్వముగా నొడగూర్చి నట్టి సం స్కృతిమయ విత్తమెల్ల - మరి చెప్పెడి దేమిక వేంకటేశ్వరా

కలి యుగ సాక్షి దైవమని గాదె నినున్ గొనియాడు చుందురీ యిల గల క్రాంత దర్శు లిటులేమి యనర్థము సంభవించినన్ పలుకక యూరకుండు జడభావము పూనుట యౌనె సాక్ష్యమన్ పలుకున కథ - మీవె తెలుపన్ వలె మాకిది వేంకటేశ్వరా

గొడ్డుల కంటె హీనులగు కూళలు రాజ్యము లేల - వారిచే పడ్డది పడ్డయ ట్లడవి పాలయి పోవ- ప్రజా సమూహముల్ గుడ్డయు కూడు - నుండ నొక గూడును లేక పరిభ్రమింప నీ యెడ్డెతనంబు నీవు సహియించుట చోద్యము వేంకటేశ్వరా

చదువొక పెద్ద నేరమయి శాస్త్ర పయోధి మథింప - దానిలో పొదలు విషాగ్ని కీలముల బోని మహోజ్జ్వల శస్త్రసంహతుల్ చెదరి పడెన్ చతుర్దిశల - చేటొన గూర్పక సర్వ మానవా భ్యుదయము మంట గల్పకది యూరక పోవునె వేంకటేశ్వరా

ఎంతటి కాంక్ష యీ నరుల కీ భువిలోనివి చాల కా ఖగో ళాంతర సీమలన్ వెదకి యచ్చటి లిబ్బిని గూడ త్రవ్వుకో నెంతురు - వీరి కర్మమున నెక్కడ జూచిన మంటి దిబ్బలే దొంతులు దొంతులై తుదకు తోచునుబో నట వేంకటేశ్వరా

Page 26

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు