#


Index

చిత్రతరంగిణి

మారిందేమిటి. అయితే ముద్దగానో, కడ్డీగానో ఉన్న బంగారమిప్పుడు గిన్నె ఆకారంగా మారలేదా అదే వికారత్వమని వాదించవచ్చు. గిన్నె ఆకారంలో కూడా ఉన్నది బంగారమే. దానిలో ప్రతి అణువు బంగారమే. పాత్ర అంతా బంగారమే. అయినప్పుడిక పాత్ర అనేదెక్కడ ఉంది. వాస్తవానికది ఒక పాత్ర అని పేరే గాని సువర్ణ ఆభాసే అది. సువర్ణమే ఆ రూపంలో అలా విశేషంగా భాసిస్తున్నది. అది దాని తాలూకు విశేషమేగాని మరి ఒక పదార్థమేదో అక్కడ ఉందని కాదు. ఇలాంటి విశేషమూ లేదా ఆభాసకే శాస్త్రంలో వివర్తమని పేరు. ప్రస్తుత మిలాంటి వివర్తమే ఈ జగత్తుకూడా. బంగారంలాగా శుద్ధమైన చైతన్యమే ఇలా నామరూపాత్మకమైన ప్రపంచంలాగా భాసిస్తున్నది. వన నదీ పర్వతాదులు - జరాయుజాది శరీరాలూ అన్నీ సువర్ణాభరణాలలాగే చైతన్యంతో నిర్మితమైన పదార్ధాలే. నిర్మితమంటే అది ఒక వికారమని పరిణామమనీ మరలా భ్రాంతి పడరాదు. ఎప్పుడూ ఉన్న ఒకే ఒక ఈశ్వర చైతన్యమే తన రూపంలోనూ జగద్రూపంలోనూ కూడా భాసిస్తున్నదని గుర్తించి దీన్ని కూడా ఈశ్వర రూపంగానే మనమెప్పుడూ దర్శిస్తూ పోవాలని భావం.

  పోతే ఇక కడపటి భ్రమ ఒక్కటే ఒకటుంది. అది ఈ జగత్తంతా వాస్తవంగానే ఉందనే భ్రమ. కారణాద్భిన్న జగతః సత్యత్వం పంచమో భ్రమః కారణమంటే సమస్త ప్రపంచానికీ మూలమైన పదార్థం. ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడనేదొక్కటే సత్యమని గదా చెబుతూ వచ్చాము. దానితో పాటు ఈ ప్రపంచం కూడా సత్యమేమోనని భ్రాంతి. ఇది లౌకికులకే కాదు. శాస్త్రజ్ఞులకు కూడా చాలమందికున్న భ్రమ. వీరి వాదమేమంటే జగత్తనేది ఈశ్వరకార్యమనికదా పేర్కొన్నారు మీరు. కారణమైన ఈశ్వరుడు సత్యమైనప్పుడు తత్కార్యమైన జగత్తు మాత్రం సత్యం ఎందుకు కాదు. కారణ గుణాలే కార్యంలోనూ ప్రవేశిస్తాయనేది సర్వ సమ్మతం. మృత్తికలో ఉండే శ్యామత్వం ఘటంలో కనిపించటం లేదా. సువర్ణంలో ఉన్న పసిమీ మిసిమీ తర్జన్యమైన ఆభరణాలలో గోచరించటం లేదా. అలాగే ఈశ్వర లక్షణమైన సత్వమే ప్రపంచంలోనూ ఉండవచ్చుకదా. అలాంటప్పుడు కనిపించే ప్రపంచాన్ని అసత్యమని తోసిపుచ్చటం దేనికి.

Page 246

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు