#


Index

చిత్రతరంగిణి

మీద ఆరోపించబడుతున్నాయి. అవి ఆరోపితమని తెలియక యదార్థంగానే జీవుడికా గుణాలున్నాయని భావించటమొక భ్రాంతి.

  ఈ భ్రాంతి తొలగాలంటే స్పటిక లోహిత దర్శనేన పారమార్థిక కర్త్వత్వ నివృత్తః స్ఫటిక లోహిత దృష్టాంతాన్ని పరిశీలించాలి మనం. లోహితమంటే ఎఱ్ఱని పదార్థం. ఏదైన ఒక ఎఱ్ఱని వస్తువు- ఒక మంకెన పువ్వొ దాసాని పువ్వొ - తెచ్చి ఒక స్పటికానికి దగ్గరగా పెట్టామనుకోండి. అప్పుడేమవుతుంది. ఆ మంకెనకుండే ఎఱ్ఱని రంగు స్ఫటికానికి సంక్రమించి అది కూడా ఎఱ్ఱగామారి కనిపిస్తుంది. అలా కనిపించిందంటే ఆ ఎఱ్ఱరంగు నిజంగానే ఆ స్పటికానికుందంటారా? స్పటికానికి సహజంగా ఉన్న రంగు ఎరుపు కాదు. తెల్లని తెలుపు. అది మనకందరికీ తెలిసినదే. అయితే ఎఱ్ఱగా ఎందుకు కనిపించటం. ఎఱ్ఱని పదార్థం ప్రక్కన ఉండటం వల్ల. తన్మూలంగా అది కూడా ఎఱ్ఱనిదని భ్రాంతి పడుతున్నాము.

  అలాగే ప్రస్తుతమీ జీవుడికే గుణమూ లేదు. స్పటికంలాగా స్వచ్ఛమైన చైతన్యమే అతని స్వరూపం. అలాంటి దానికి మనః ప్రాణాదులనే ఉపాధులు చుట్టూ చేరాయి. చేరేసరికి వాటికున్న కర్తృత్వాది గుణాలు పుష్ప గుణాలు స్పటింకలో లాగా జీవుడిలో ప్రవేశించాయి. తన్నిమిత్తంగా ఇతడికి కర్త భోక్త అనే పేరు వచ్చింది. అలా భాసిస్తున్నా అది అకర్తే అభోక్తే. స్పటికమెలా తెల్లగానే ఉందో అలాగే అది గుణసాంగత్యం లేకుండా నిస్సంగంగానే నిలిచి ఉంది.

  పోతే ఇక మూడవ భ్రమ. శరీరత్రయ సంయుక్తో జీవస్సంగీ తృతీయకః. శరీర త్రయమంటే స్థూల సూక్ష్మకారణ శరీరాలు. ఇందులో స్థూలశరీరమే మనకు తెలుసు. ఇది గాక సూక్ష్మమూ కారణమూ అని మరి రెండు శరీరాలున్నాయి. అయితే అవి దీనిలాగా కరచరణాద్యవయవాలతో ప్రత్యక్షంగా కనిపించేవి కావు. మన శరీరంలో ఉండే ప్రాణమూ మనస్సే సూక్ష్మ శరీరం. అలాగే చలనాత్మకమైన ఈ మనః ప్రాణాలకు కూడా అతీతంగా ఉండి తరుచుగా మన కనుభవానికి వచ్చే ఒక అయోమయావస్థ కారణ శరీరం. ఏమీ తోచటం లేదు నాకని ప్రతి వాడూ పేర్కొంటాడు. ఆ ఏమీ తోచని స్తబ్ధతే అది. సుషుప్తి మూర్ఛాదులలో దర్శనమిస్తుంది. కాబట్టి శరీరత్రయమనేది శాస్త్రం చెప్పటమే కాదు మన అనుభవంలోనే కనిపిస్తుంది.

Page 243

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు