హాస్యమొక రసాయనంలాగా పనిచేస్తుంది. విదూషకాది పాత్రలు నాటకాలలో ఇందుకే అవతరించాయసలు. రామాయణ భారతాల లాంటి ఉద్గ్రంధాల లోనే ఇలాంటి మనోవినోదం కావలసి వచ్చింది. భారతంలో భీమబకాసుర వృత్తాంతం మయసభలో దుర్యోధన పరాభవం – ఉత్తర కుమారుడి ప్రగల్భాలూ ఇలాంటివే. రామాయణంలో రాక్షస స్త్రీ వర్ణనమూ - లంకా దహనమూ- మధువన ధ్వంసమూ ఇందుకోసమేర్పడ్డవే.
హాస్యమనేది ఇంకా అనేక ప్రయోజనాలు సాధిస్తుంది. ఒక భావాన్ని మామూలుగా చెబితే లేని తీవ్రత వ్యంగ్యంగా హాస్యంగా చెబితే సిద్ధిస్తుంది. వీరెవర్రయ్య ద్రుపద మహారాజులే - అనే నన్నయగారి పద్యంలో ఎంత వ్యంగ్య చమత్కారముందో అందులో ఎంత తీవ్రత ఉందో సహృదయులకే విదితం.
ఎంత ప్రయత్నించినా బోధ పడని క్లిష్టమైన భావం కూడా చమత్కారాన్ని మేళవించి చెబితే బాగా స్పష్టమవుతుంది. పంగ్వంధ న్యాయమని ఒకటుంది. కుంటివాడూ గుడ్డివాడునని అర్థం. జడమైన ప్రకృతి గ్రుడ్డిదట. చేతనుడైన పరమాత్మ కుంటివాడట. ఏ ఒక్కదానికీ ప్రవృత్తి లేదు. రెండూ కలిసి ఒకటి మార్గం చూపుతుంటే మరొకటి సృష్టినంతా చేస్తూ పోయిందట. ఇది సాంఖ్యవేదాంతంలో చెప్పే దృష్టాంతం.. సాంఖ్యుల ఈ పరిణామవాదాన్ని హేళన చేస్తూ భగవత్పాదులిలా అంటారు. నహికుక్కుట్యా ఏకదేశఃపచ్యతే - ఏకదేశః ప్రసవాయ కల్ప్యతే. కోడిపెట్టను కొంత పచనం చేసి కొంత గ్రుడ్లు పెడుతుందని దాచిపెట్టాడట ఒకడు. ఆసామెతగా ఉంది పరమాత్మ కొంత ప్రపంచంగా మారి కొంత మారకుండా నిశ్చలంగా ఉందనే మాట. ఇలాంటి సామెతలూ లోకోక్తులూ దృష్టాంతాలూ కుప్పతెప్పలు మన శాస్త్రాల్లో. అవన్నీ హాస్యరస గర్భితాలే. రస బంధురమైన కావ్యాలలోనే గాక గంభీరతరమైన శాస్త్రాలలో కూడా పీట వేసుకొని కూచున్నదంటే హాస్యరసానికున్న చొరవ ఎలాంటిదో చూడండి.
అన్నింటినీ మించి ఈ హాస్యానికొక గొప్ప ప్రయోజనముంది. అది సంఘ సంస్కరణం. మానవుల బుద్ధులలో పేరుకొని ఉన్న దట్టమైన మాలిన్యాన్ని బాగా ప్రక్షాళనం చేసి ఉజ్జ్వలమైన వివేక జ్ఞానదీపాన్ని వెలిగించే అద్భుతమైన మంత్ర
Page 203