సంక్రాంతి
సూర్యుడు మాసానికొక రాశి చొప్పున మేషాదులైన పండ్రెండు రాసులలోనూ సంక్రమిస్తూ పోతాడు కాబట్టి సంక్రమణ మని సంక్రాంతి అని పేరు వచ్చింది. పన్నెండూ సంక్రమణమే అయినా ఒక మకర సంక్రాంతీ కర్కాటక సంక్రాతీ ఈ రెండింటినే మామూలుగా సంక్రాంతి అని వ్యవహరిస్తుంటారు. అందులోనూ మకరసంక్రమణాన్నే ఎంతో గొప్ప పుణ్యకాలమని పరిగణిస్తారు లోకులు. ఏమి కారణం. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం ప్రారంభమయ్యే కాలమది.
సంవత్సరంలో ఆషాఢం మొదలుకొని పుష్యమాసం వరకూ దక్షిణాయనమైతే పుష్యం మొదలు మరలా ఆషాఢం వరకూ ఉత్తరాయణం. ఉత్తరాయణాని కున్న ప్రాశస్త్యం దక్షిణాయనానికి లేదు. ఏ శుభకార్యమైనా దక్షిణాయనంలో కాక ఉత్తరాయణంలోనే జరుపుకుంటారు. ఉపనయనానికి ఉత్తరాయణంలోనే ముహూర్తం పెడతారు. వివాహాది శుభకార్యాలకు కూడా దక్షిణాయనం కన్నా ఉత్తరాయణమే ప్రశస్తమంటారు. ఆఖరుకు అవసానం కూడా మానవులకు ఉత్తరాయణంలో కలిగితేనే మంచిదనే నమ్మకముంది లోకులకు. మహాభారతంలో భీష్ముడు యుద్ధంలో పడిపోయినా అప్పుడే మరణించక ఉత్తరాయణం వచ్చేదాకా అలాగే అంపశయ్యమీద కాలక్షేపం చేసిందీ అందుకే.
మకర సంక్రమణంతో ఆరంభమయ్యే ఉత్తరాయణానికీ ఎందుకింత ప్రాధాన్యమిచ్చారు లోకులు. లోకులే కాదు శాస్త్రంకూడా అదే ప్రశస్తమైన కాలమని బోధిస్తున్నది. గీతలో భగవానుడే సెలవిస్తున్నాడు. ప్రణవజపం చేస్తూ తత్పరిపాకబలంతో ఉత్రమణ చెందిపోయే యోగులందరూ ఉత్తర మార్గంలోనే పయనమైపోతారట. అలా పోయనప్పుడే వారికి పునరావృత్తి లేదట. ఉత్తర మార్గమంటే అది ఎలాంటిదో వర్ణించింది గీత. అగ్నిర్జ్యోతి రహశుక్లః - షణ్మాసా ఉత్తరాయణమ్. శుక్లమైన తేజస్సు బ్రహ్మాండంగా వెలిగిపోయే కాలముత్తరాయణం. అప్పుడు నిష్క్రమిస్తే కలిగే ఫలితమేమిటో తెలుసా. తత్రప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః బ్రహ్మో పాసకులైన వారందరూ అప్పుడు మరణిస్తే సగుణ బ్రహ్మ లోకమైన
Page 187