ఉమరు ఖయ్యాము
1. ప్రతిదేశంలోనూ మేధావంతులెప్పుడూ జన్మిస్తూనే ఉంటారు. మేధా సంపత్తి కంతటికీ పరాకాష్ఠ మానవుడి తత్త్వదర్శనమే. దానిబలంతో ఉచ్చరించిన ప్రతి వాక్కూ ఒక గొప్ప సుభాషితం. అది చిరస్మరణీయమేగాక మానవజీవితానికే మార్గదర్శకం. ఇలాటి గొప్ప సూక్తులు మన హైందవులే కాదు. బౌద్ధులూ చెప్పారు క్రైస్తవులూ చెప్పారు, మహమ్మదీయులూ చెప్పారు. మహమ్మదీయులలోనే సూఫీలనేవారు చాలా గొప్ప దార్శనికులు.
2. సూఫీ న శవద్ సాఫీ-తా దర్ న కషద్ జామీ - అన్నాడు షేక్ సాదీ అనే సూఫీ విద్వాంసుడు. సాఫీ అయినవాడే సూఫీ అట. అంటే మానసికంగా పరిశుద్ధుడయిన వాడని అర్థం. ఎలా అవుతాడు పరిశుద్ధుడు. ద ర్నకషద్ జామీ. ప్రపంచమనే ముండ్లకంపలో తగులుకోకుండా మనసనే వస్త్రాన్ని ఎప్పటికప్పుడు మెళకువతో తప్పించగలిగినప్పుడు. అంటే అప్పటికి మనలాగానే లోకంలో తిరుగుతున్నా వ్యవహరిస్తున్నా. ఏమాత్రమూ అంటి ముట్టకుండా దాని ప్రభావానికి లోనుకాకుండా ఉండాలన్నమాట. అలా బ్రతికితేనే వాడు నిజమైన సూఫీ మన భాషలో జీవన్ముక్తుడు.
3. ఇలాటి అచ్చమైన సూఫీ మహాపురుషులెందరో ఉన్నారు. ఫిరదోసీ దగ్గరి నుంచీ నిన్న మొన్నటి మీర్జాగాలిబ్ వరకూ అందరూ ఇలాటి కోవకు చెందినవారే. ముఖ్యంగా పదకొండవ శతాబ్దికి చెందిన ఇమామ్ గజాలి, పన్నెండవ శతాబ్దికి చెందిన జలాలుద్దీన్ రూమి, ఇద్దరూ తేజస్తంభాల లాంటివారు. ఇందులో గజాలీ సిద్ధాంత భాగానికైతే, రూమీ దాని అనుభవాన్నే అందరికి పంచిపెట్టిన మహనీయుడు. కాగా వీరిద్దరినీ అపోశనం పట్టిన వాడు హకీమ్ ఉమర్ ఖయ్యాము. ఖయ్యామనగానే మనకొక చిన్న చూపు. అతడొక తాగుబోతని, భోగలాలసుడని చివరకు నాస్తికుడని కూడా ముద్ర వేశారు లోకులు. అతడిందులో ఏదీ కాడు వాస్తవంలో మహాజ్ఞాని. మహాయోగి, తత్త్వం తెలిస్తే జ్ఞాని, అనుభవిస్తే యోగి.
4. అతడే అంటాడొకచోట దర్ ఆలమే నిహాన్ బహోష్ మీ బాయద్ బూద్, దర్ కారే జహాన్ ఖమూష్ మీ బాయద్ బూద్ బాహ్య జగత్తుతో వ్యవహరించేటపుడు
Page 174