ఏమిటి కథ. వినటానికి మనోహరంగానే ఉంది. కాని అంతరార్థమేమిటి? ఆ
రాక్షసుడు చస్తే మనకందరికీ దీపావళేమిటి. దీపావళి అంటే దీపపంక్తి. అది మన
మానవలోకానికే కాదు. మూడులోకాలకూ వెలుగునిచ్చేది. వెలుగెందుకు కావాలి
అసలు. చీకటి కమ్ముకొంటే, చీకటేమిటి? అసలైన చీకటి మనలో పేరుకొన్న అజ్ఞానం.
అది దేవతలకుంది. మానవులకుంది. దానవులకుంది. గుణత్రయానికి సంకేతమే
గదా ఈ. త్రివిధ సృష్టి. కాబట్టి అంతో ఇంతో అజ్ఞానమందరికి సహజం. ఈ
అజ్ఞానమనే అంధకారానికి సంకేతమే నరకుడు. న రీయతే ఇతి నరః- ముక్తి లభించే
వరకూ చావని తత్త్వమేదో అది జీవభావం. జీవుడు నరుడైతే జీవుడికున్న అజ్ఞానం
నరకుడు. ఇది సురకాదు. అసుర. స్వతోరాజతే. స్వరూపంతో రాజిల్లేది సుర. అంటే
జ్ఞానం. అదిలేకుంటే అసుర. అజ్ఞానమున్న నరుడసురుడు కాక సురుడెలా కాగలడు.
అంటే మన బోటి జీవులే నరకాసురులు. ప్రాగ్జ్యోతిషమే మన నివాసస్థానం. ప్రాక్కంటే
ప్రాచీనం. పురాతనం నుంచీ ఉంది మనలో ఆత్మచైతన్య జ్యోతి. అందులోనే ఉన్నాము
మన మసలు. అప్పుడే కాదు ఇప్పుడూ. అయితే గుర్తించలేకపోతున్నాము. అందుకే
నరకాసురులం. మన జన్మ ఎలాంటిది. మమైవాంశో జీవలోకే జీవ భూత స్సనాతనః
- సనాతనమైన పరమాత్మ అంశోద్భవులమే మనం. అయితే దివ్యమైన ఆ చైతన్యజ్యోతికి
భూసంపర్కమేర్పడింది. ఈ దివ్యభౌమ సంబంధమే మనం నరకులం కావటానికి
కారణం. దివ్యం మనలో ఉన్న చైతన్య కళ. అయితే భౌమం మన కేర్పడ్డ ఈ
అచేతనమైన శరీరాది సంఘాతం. ఈ ఉపాధి ప్రచోదనతో ఎంత బుద్ధి బలంతో
ఎన్ని శక్తులు సాధించినా అసుర వాసనలు వదలవు. అవి రజస్తమనస్సులను ప్రబలం
చేసి సత్వానికి దూరం చేస్తాయి వీణ్ణి. దేవతలను మహర్షులను నరకుడు బాధించాడంటే
సత్వగుణాన్ని కోలుపోయాడనే అర్థం. పోతే అదితి కుండలాల నపహిరించాడు
వాడు. దితి కానిదేదో అది అదితి. దితి అంటే ఖండం. అపూర్ణం. అదితి అంటే
అప్పటికి పూర్ణమైనది ఆకాశతత్త్వం. దానికున్న కుండలాలేవో కావు. తేజోమయమైన
సూర్యచంద్రులు. సూర్యచంద్రులంటే మనః ప్రాణాలూ లేదా జ్ఞాన క్రియా శక్తులు.
అది అసుర బలంతో కాజేసినా అవి వాడికి దక్కవు. ఉపయోగపడవు.
కనుకనే ఆ అసురభావాన్ని శిక్షించదలచాడు పరమాత్మ. అసురుణ్ణి కాదు. అసురభావాన్ని, అంటే మానవుడిలో పేరుకొని ఉన్న రజస్తమోగుణాలను,
Page 153