వినాయక చతుర్థి
ప్రతి సంవత్సరమూ భాద్రపద శుద్ధ చవితినాడు మనం వినాయుడి పూజ చేసుకొంటాము. మనకంటే శక్తిమంతులైన దేవతలనారాధిస్తే వారు ప్రసన్నులయి మన కోరికలు సఫలం చేస్తారని నమ్మకం. ఇంకా తీవ్రంగా వారి నుపాసన చేస్తే దేహ పాతానం తరం వారి లోకాలకే పోయి వారి సాయుజ్యమునే చెందుతామని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. వినాయకుడు కూడా ఒక దేవతే. దేవతే కాదు, దేవతా జ్యేష్ఠుడు. వాగీ శాద్యా స్సుమనసః సర్వార్థానా ముపక్రమే యం నత్వా కృత కృత్యాః స్యుః అని ఆర్యోక్తి. బ్రహ్మదేవుడు మొదలు సమస్త దేవతలూ ఏపని తలపెట్టినా మొదట వినాయకునికి మ్రొక్కుబడి చెల్లిస్తే గాని కృతార్థులు కాలేరట. దేవతల మాటే ఇలా ఉన్నప్పుడిక మానవుల మాట చెప్పేదేముంది. అంచేత త్రిలోక వాసులకూ పూజనీయుడీ వినాయకుడు. కనుకనే అటు వైదికులకూ ఇటు తాంత్రికులకూ కూడా ఆరాధనీయుడయ్యాడు. గణానాం త్వా గణపతిగ్ం హవాహమే అని ఋగ్వేదమే ఘోషిస్తున్న దాయన మాహాత్మ్యాన్ని. పోతే తాంత్రిక వాఙ్మయంలో ఈదేవత అన్నిటింకీ మూలాధారమయి కూచున్నది.
అసలెందుకింత ప్రాధాన్యమిచ్చారీ దేవతకు. ఆయన పేరే చెబుతున్నది మనకు సమాధానం. వినాయకుడంటే వినయం చేసేవాడు. వినయన మంటే శిక్ష. అందరినీ శిక్షించి వారిని సన్మార్గంలో నడిపేవాడని అర్థం. ఎవరా అందరూ. ప్రమధ గణాలు. మనసును దుష్టభావాలతో మధిస్తాయి కాబట్టి ప్రకృతి శక్తులకే ప్రమధ గణాలని పేరు. వాటినిలా విచ్చలవిడిగా తిరగకుండా సాధకులను బాధించకుండా వాటి నదుపులో పెట్టుకొని ఆధిపత్యం వహించే మహాశక్తి ఏదుందో అది గణపతి గణేశుడు. గణాల కధిపతి అని అర్ధం. దానివల్ల ఒక సత్కార్యానికెప్పుడూ అంతరాయం కలిగే ప్రమాదం లేదు కాబట్టి విఘ్ననాయకుడు విఘ్నేశుడని కూడా సార్ధకంగా ఏర్పడిందాయనకు. సత్త్వరజస్తమోగుణాలే అసలు గణాలు. ఇవే నిర్గుణమైన జీవచైతన్యాని కడ్డు తగిలి అతని కార్యాలకు ఫలసిద్ధి లేకుండా చేస్తున్నాయి. వీటిలో దేవతలు సత్త్వానికీ, మానవులు రజస్సుకూ, రాక్షసులు తమస్సుకూ లోనయిన వారు కాబట్టి వాటి బారి తప్పించుకోవాలంటే వాటిని నివారించే ఒక మహాశక్తిని
Page 148