అది మన స్వరూపమే అయినా అనాది సిద్ధమైన మన అజ్ఞానంవల్ల మరుగుపడి పోయింది. మరుగుపడి అదే తనకుభిన్నమైన ఆకాశాది ప్రపంచంగా భాసిస్తున్నది. మరలా దాని నందుకొంటేగాని మోక్షం లేదు మానవుడికి అందుకోవాలంటే ఏమిటి సాధనం. దాని నుంచి ఏర్పడిన ఈ ప్రపంచమే. సువర్ణం నుంచి తయారైన ఆభరణాల జాతం సువర్ణ స్వరూపాన్ని మనకుపట్టి ఇచ్చినట్టే శివతత్త్వం నుంచి సృష్టి అయిన ఈ ప్రపంచమే శివస్వరూపాన్ని మనకు పట్టి ఇస్తుంది.
3. ఆకాశమే అన్నిటికన్నా మొదట సృష్టి అయిందని చెప్పాము. శివలింగం పతనం కావటమంటే ఇదే. శివతత్తాన్ని సూచించే ఈ ఆకాశమనే లింగం అందులో నుంచి ఊడిపడిందని అర్థం. అందులో నుంచి ఉద్భవమయింది గనుకనే లింగోద్భవ మన్నారు దీన్ని. ఉద్భవించి ఇది దశదిశలా వ్యాపించింది. దశదిశలా వ్యాపించే గదా కనిపిస్తున్నదీ ఆకాశం మనకిప్పుడు. లింగమంటే ఒక అండాకారమని భావించినా అలాగే ఉన్నదాకాశం. మనదృష్టినీ మూలనుంచి ఆ మూలకు పరపితే పైన కనిపించే ఆకాశమండంలో ఒక భాగం. పోతే ఈ భూమిక్రింద గూడా ఇలాగే మరొక భాగం కనిపిస్తుంది. రెండూ కలిపితే ఇది నిజానికొక అండమే. అఖండంగా ప్రసరించి ఉన్నది గనుక బ్రహ్మాండమన్నారు దీన్ని. కాగా ఇందులో ఏర్పడ్డ సూర్యచంద్రాది గోళాలు కూడా అండాకారంగానే ఉన్నాయి. గనుక వాటి కండాండాలని పేరుపెట్టారు. మరి వీటిలో మనలాంటి జీవరాసులెన్నో పుడుతూ గిడుతూ ఉంటే వీటిని పిండాండాలన్నారు. మొత్తానికన్నీ అండాకారాలే. అన్నిటికన్నా సూక్ష్మమైన పరమాణువు కూడా అండరూపంగానే పరిభ్రమిస్తున్నది. దీర్ఘవలయాకారం ప్రతి ఒక్కటీ. వలయంలో ఉన్న లక్షణమేమంటే దానికాద్యంతాలనేవి కానరావు. ఎక్కడనుకొంటే అక్కడే ఆది. అక్కడే అంతం ఆకాశానికిప్పుడేది ఆది, ఏది అంతం. పైగా నిరాకారమూ నిశ్చలమూ వ్యాపకమైన పదార్ధమిది. ఇన్ని లక్షణాలున్నా అచేతనం. అచేతనం గనుక తనపాటికి తానుద్భవించలేదు. చేతనమైన తత్త్వమొకటి ఉండాలది ఉద్భవించటానికి, చేతనం గనుకనే అది శివం. అచేతనమైనది గనుక ఇది శవం. శవమైనా తన ఉనికి ద్వారా శివమైన ఆ తత్వాన్ని సూచిస్తున్నదిది. అచేతనమైన నేనా చైతన్యం నుంచే ఉద్భవించానని మౌనంగా మనకు చాటుతున్నది.
Page 139