#


Index

చిత్రతరంగిణి

శివరాత్రి ప్రాశస్త్యము

  1. శివరాత్రి పర్వదినమిది. రాత్రి అయినా నిద్రపోకుండా జాగరణ చేస్తాము కాబట్టి ఇది దినం. దినమైనా రాత్రిలాగా ఉపవాసం చేస్తాము కాబట్టి రాత్రి. మిగతా పండగల లాగా విందులూ వినోదాలూ లేవిందులో. ఉపవాస దీక్షతో ఉండాలి. రాత్రంతా జాగరం చేయాలి. ఏమి, ఎందుకని. అది లింగోద్భవమయ్యే కాలమట. లింగోద్భవమేమిటని అడిగితే దానికొక కథ చెబుతారు. పూర్వం శివుడు పార్వతిని పెండ్లాడిన తరువాత దిగంబరుడై దారుకావనంలో ఋషివాటికలో భిక్షాటన చేస్తూ వచ్చాడట. ఋషి పత్నులాయనకు భిక్షచేసి ఆయన కైలాసం వెడుతుంటే ఆయనతోపాటు తాము వెడతారు. ఆపాటికి వారి భర్తలాశ్రమానికి తిరిగివచ్చి తమ భార్య లీశ్వరుని వెంటబడి పోవటం చూచి ఆయనకు లింగపాతమయ్యేలాగా శపిస్తారు. అది పతనమై భూనభోంతరాలంతా వ్యాపిస్తుంది. దాని ఆద్యంతాలు తెలుసుకోవటానికి బ్రహ్మ, విష్ణులొకరు పైకి ఒకరు క్రిందకి బయలుదేరుతారు. ఎంతదూరం పోయినా వారికేమీ అంతుపట్టక తిరిగి వస్తారు. విష్ణువు తనకు తెలియలేదని నిజం చెబితే బ్రహ్మ తెలిసిందని అబద్దమాడుతాడు. దానివల్ల ఆయనకు పూజా పురస్కారాలు లేకుండా పోయాయట లోకంలో. ఇంతకూ రాత్రి పన్నెండు గంటలకు సరిగ్గా శివలింగముద్భవించిన కాలం కాబట్టి అది చాలా ప్రశస్తమయిందని మన పురాణాలు వర్ణించే కథ.

  2. ఏమిటీ కథ. దీనినెలా అర్థం చేసుకోవాలి మనం. శివలింగమేమిటి పతనం కావటమేమటి. అది భూనభోంతరాలు వ్యాపించటమేమిటి. చూడబోతే ఇది అసంభవమే గాక చాలా అశ్లీలమని కూడా తోస్తుంది మనకు. అయితే ఇంత అశ్లీలమైన కథలెందుకు చెప్పాయి మన పురాణాలని ప్రశ్న. వీటిని కేవలం సంకేతాలు గానే భావించాలి మనం. శివలింగమంటే శివతత్త్వాన్ని సూచించే లింగం లేదా చిహ్నమని అర్థం. అది ఏదోగాదీ కనిపించే ఆకాశమే. తస్మాదేతస్మా దాత్మన ఆకాశ స్సంభూతః అని చాటుతున్న దుపనిషత్తు. పరిశుద్ధమైన ఆత్మచైతన్యం నుంచి మొట్టమొదట జన్మించిందాకాశమేనట. ఆత్మ చైతన్యం స్వత స్సిద్ధం గనుక దానికి శివమని పేరు,

Page 138

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు