#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
వీరహా
రక్షణః
సంతః
జీవనః
పర్యవస్థితః
విరుద్ధంగా నడచుకొనే గర్విష్ఠులను క్షమించడు. త్రోసి పారేస్తాడు. అలాకాకుంటే రక్షణ ఇస్తాడు. వివేచనాశీలు రందరూ (సంతః) ఆయన కాత్మీయులే, వారందరికీ జీవన ప్రదాత ఆయనే. వారిలో భావంలో బాహ్యంలో స్థిరంగా నెలకొన్నవాడా ఈశ్వరుడే.
అనంతరూపః
అనంతశ్రీః
జితమన్యుః
భయాపహః
హద్దులేకుండా వ్యాపించిన రూపమది. దానికి భంగంలేదు. దాని నాశ్రయించి ఉన్న శక్తికి (శ్రీ) కూడా నాశం లేదు. ఆ రెండింటి కలయికే ఈ సృష్టి. కాబట్టి ఈ జీవకోటి మీద (మన్యు) ఆగ్రహ మెప్పుడూ లేదు. లేకపోగా వీరి భయాన్ని నిర్మూలించేది అదే.
చతురశ్రః
గభీరాత్మా
విదిశః
వ్యాదిశః
దిశః
శక్తి గలదది కనుక నలువైపులా పదునుగలది. లోతుకు దిగే కొద్దీ లోతైన స్వరూపమది. అంతుచిక్కదు. చిక్కకుండా ఎక్కడో దాగి ఉన్నదా అంటే అలా కాదు. దిశలూ, విదిశలూ అన్ని వైపులా అదే. అన్నీ కూడా అదే. అంతేకాదు - అన్నీ తానే అయి మరలా అన్నింటినీ ఆదేశిస్తుంటుంది.
అనాదిః
భూః
భువః
లక్ష్మిః
ఆది (కారణం) లేనిదది. కారణం లేకుండానే కార్యరూపంగా (భూః) జన్మిస్తున్నది. జన్మించటమే కాక చరాచరాలన్నింటినీ (భువః) జన్మింపజేస్తున్నది. చేసి వీటినే లక్షణంగా చేసుకొని తన తత్త్వాన్ని లక్షించండని చెబుతున్నది.
సువీరః
రుచిరాంగదః
ఎవడైనా ఈ లక్షణాన్ని బట్టి ఆ లక్ష్యాన్ని గుర్తిస్తే అలాంటి గొప్ప వీరుడికి ఉజ్జ్వలమైన (రుచిర) జ్ఞానమనే (అంగ) విగ్రహాన్ని (ద) ప్రసాదిస్తుంది. ప్రజ్ఞాన స్వరూపుడవుతాడీ సాధకుడని భావం.

Page 63

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు