నామం | అంతరార్థము |
---|---|
దివిస్స్పృక్ సర్వదృగ్వ్యాసః వాచస్పతిః అయోనిజః |
దహరాకాశ పరాకాశాలను రెంటినీ స్పృశిస్తూ - సర్వమూ దృక్కే అయి (వ్యాస) వ్యాపించిన తత్త్వమది. సర్వాన్నీ కల్పించే పరాశక్తి (వాచః) కే అధిపతి. అలాటి దాని జన్మకేది యోని. అందుకే అయోనిజం-అజమది. |
త్రిసామా సామగః సామ |
జీవ జగదీశ్వర తత్త్వాలు మూడింటి సామ్యస్వభావమది. మూడింటి లోపలా బయటా పరచుకొని ఉన్నది. మూడు లేవసలు. వాటిని వ్యాపించటమూ లేదు. సర్వసమానంగా ఉన్నది ఒక్కటే. |
నిర్వాణమ్ భేషజమ్ భిషక్ |
అన్ని తాపాలకూ ఉపశమనమది. గొప్ప దివ్యౌషధం. అది పడితే చాలు త్రివిధ తాపాలకూ జవాబు చెబుతుంది. ఆ ఔషధం ప్రసాదించే వైద్యుడు కూడా అదే. |
సన్న్యాసకృత్ శమః శాంతః |
విజాతీయమైనదంతా త్యజించినదది. త్యజించి దానినంతటినీ తనలోనే లయింపజేసినది. చేసి ఎలాంటి వికారమూ లేక అచలంగా నిలిచిపోయినది. |
నిష్ఠా శాంతిః పరాయణమ్ |
అలాంటి స్థితే కట్ట కడపటిది. అదే మీ మా శాంతి. అదే ఎప్పటికైనా మీరందుకోవలసిన పరమమైన గమ్యమని సాధకులకు బోధిస్తున్నది. |
శుభాంగః శాంతిదః స్రష్టా |
మోక్షమనే గొప్ప శుభాన్ని వారికంటిస్తుంది. (అంగ) అశాంతిని తొలగించి శాంతిని ప్రసాదిస్తుంది. దానికి వ్యతిరిక్తమైన తగుల మంతటినీ వదిలిస్తుంది. |
కుముదః కువలేశయః |
వదిలించేవారికి వదిలిస్తూ మిగతా వారినీ సాంసారికమైన కుమోదంలోనే పడదోస్తుంది. అది అనుభవించటానికి జీవ రూపంగా తానే వచ్చి ఈ (కువల) దేహచక్రంలో శయనిస్తాడా పరమాత్మ. మన ఈ దేహమే కాదు. బాహ్యమైన జగచ్చక్రం కూడా కువలమే. ఇందులోనే అంతర్యామి రూపంగా వచ్చి కూచున్నాడు. |
Page 45