నామం | అంతరార్థము |
---|---|
ఉగ్రః సంవత్సరః దక్షః విశ్రామః |
ఉచ్ఛమైన స్థితి అది. సమస్తమూ అందులోనే చక్కగా వసిస్తున్నది. దక్ష - అందుకే సర్వసమర్థమైనది. అక్కడే విశ్రాంతి ఈ సాధకుడికి. శ్రాంతి లేనిదేదో అది విశ్రాంతి. శ్రాంతి ఈ సాంసారికమైన తాపత్రయమే. అది లేని స్థానం గనుక విశ్రామం. |
విశ్వదక్షిణః | అయితే దాని నందుకోవాలంటే విశ్వంమీద భ్రాంతి ఉండ కూడదు. దీనినంతా దక్షిణగా సమర్పించాలి దానికి. |
విస్తారః స్థావర స్థాణుః |
ఆ విశ్రాంతికూడా ఎంతో విస్తీర్ణమైనది. ఎప్పుడూ సంకుచితం కాదు. స్థావరస్థ - స్థావరంగా ఉండే అణు అణువది. అతి సూక్ష్మమైనది. |
ప్రమాణం బీజమ్ అవ్యయమ్ |
దానికేమిటి ప్రమాణమని ప్రశ్నలేదు. దానికదే ప్రమాణం. జ్ఞానం కనుక స్వతః ప్రమాణమది. మిగతా ప్రత్యక్షాది ప్రమాణాలకూ వాటికి గోచరించే ప్రమేయాలకూ బీజం ప్రవర్తకమిది. అవ్యయం. తాను మారకుండా వీటి మార్పును గమనిస్తుంటుంది. |
అర్థః అనర్థః |
అర్థమూ అదే అనర్థమూ అదే. దాన్ని అర్థించే సాధకుల కర్థం. అర్థించని పామరుల పాలిటికదే అనర్థం. |
మహాకోశః మహాభోగః మహాధనః |
అది ఒక గొప్ప కోశం. నిధి. నిధిలాగే చాలా గుప్తంగా ఉన్నది. మహా+ఆ భోగ. చాలా విశాలమైనది. సమృద్ధమైనది. ఏ ధనమూ పనికిరాదు దాని దగ్గర. మహాధనం. ప్రపంచమంతా దాని ధనమే. |
అనిర్విణ్ణః | అందుకే దానికి నిర్వేదం లేదు. ఎప్పుడూ తృప్తిగా ఉంటుంది. దానినందుకొంటే మనకూ తృప్తే. కాని విసుగు చెందరాదు సాధకుడు. అనిర్విణుడయి ఉండాలి. |
Page 36