#


Index

  మనోనేత్రానికి తోచే ఆయా దేవతా మూర్తులు కూడా అదే. సోక్షరః పరమః స్వరాట్. అంతే కాదు. ఇన్ని రూపాలలో అది క్షరమై పోతున్నట్టు కనిపించినా వస్తుతః అది అక్షరమే. ఈ ఉపాధులలాగా జనన మరణాల పాలయ్యేది కాదు. అజరామరమైన తత్త్వం. సామాన్య రూపమది. విశేషాలు ఎప్పటికప్పుడు వస్తూ పోతుంటాయే గాని వాటికధిష్ఠాన మైన సామాన్యమలా నశించదు. తరంగ బుద్భుదాదుల లాగా సముద్ర జలం నశిస్తుందా. అలాగే ఇదీ అక్షరమే. సముద్ర జలమైనా ఉదాహరణ కిచ్చామే గాని అదీ క్షరమే ఆమాటకు వస్తే. తేజస్సు దృష్ట్యా జలం నశించేదే. వాయు దృష్ట్యా తేజస్సు పోయేదే. ఆకాశ దృష్ట్యా అదీ పోవలసిందే. కాగా ఆకాశం కన్నా పరమైనది చైతన్యం. స్వతః ప్రమాణమది. స్వరాట్ స్వయం రాజతే ఇతి స్వరాట్. తన పాటికి తనుండ గలదు ప్రకాశించ గలదు. కనుకనే అది పరమః - ఆకాశాది ప్రమేయ జాతాని కంతా పరమమైనది. విలక్షణమైనది.

  అదే మన అసలైన స్వరూపం. దాని నందుకొంటేనే ఎప్పటికైనా మోక్షం మానవుడికి. కనుక ఈ జీవాత్మ భావం పోయి ఆ పరమాత్మ తోడి సాయుజ్యం లభించాలని కోరుతూ ఆ పరమాత్మకు మనసా వాచా కర్మణా శరణాగతి పొందాలి. నమస్సంటే తలవంచి శరణు వేడటం. ఇదే ప్రపత్తి అనే మాటకు కూడా అర్ధం. ఎలాగో వర్ణిస్తూన్నది మంత్రం.

Page 164