సంస్కార రూపంగా ఉన్న దాన్నే రెండవ రోజు శబ్ద రూపంగా ఆవాహన చేస్తామన్న మాట. అంచేత అవ్యక్తంగా ఉన్న శక్తిని అప్పుడప్పుడు వ్యక్తం చేసుకొని దర్శించటమే మనం చేసే వందనం. చేసినా చేయక పోయినా అవ్యక్త రూపంగా నీ దగ్గరే నీ మనసులోనే ఉందది. మనోమయి గదా లేకుండా ఎలా పోతుంది. ఇదీ ఇందులో ఉండే అంతరార్థం.
కాబట్టి సర్వకాలాల్లో నని కాకపోయినా కనీసం మూడు కాలాల్లో నైనా చేయవలసిన బాధ్యత ఉంది మానవుడికి. ఆ మూడు కాలాలకూ మూడు సంధులని పేరు. సంధి అంటే రెండింటి కలయిక. ఏమిటా రెండూ. పగలూ రాత్రీ. రాత్రి పోయి పగలు వచ్చే సంధి ప్రాతస్సంధి. పగలు పోయి రాత్రి వచ్చే సంధి సాయం సంధి. అలాగే పూర్వాహం పోయి అపరాహం వచ్చే సంధి మాధ్యాహ్నిక సంధి. ఈ మూడు సంధులలో ఆ దేవత అభివ్యక్త అవుతుంది గనుక సంధ్య అని పేరు వచ్చిందా దేవతకు. అలాగే ఈ త్రిసంధులలో చక్కగా ధ్యానం చేస్తే మనం కోరిన ఫలాన్ని అందజేస్తుంది గనుక కూడా సంధ్య అని పేరు వచ్చింది. సమ్యగ్ధ్యానం చేస్తే సంధ్య. లేక సంధిలో ప్రకటమైతే సంధ్య. ఏ అర్థం చెప్పుకొన్నా సరిపోతుంది.
సంధి అనే దాని కెందు కింత ప్రాధాన్య మిచ్చారంటే అసలు సంధి అంటే ప్రాతః కాలం సాయంకాలమని కూడా కాదు.
Page 15