#


Back

ఆత్మ విమర్శ

1.మానుషజన్మమెత్తియు – నమానుషకృత్యము లాచరించు నీ మానవజాతి యెన్న డిక మంచికి నర్ధమెరుంగు – న్నెన్నడీ దానవ చేష్టితం బుడిగి దైవ గుణంబుల నభ్యసించు – నీ శానుడె వచ్చిచెప్పినను సంభవమంచు దలంప నెప్పుడు.

2.ఆయీశానుడె గాదెయిచ్చె మనకా హామి యిత: పూర్వమే చాయం దుష్కృతు లుద్భవింతురు వినాశంబేను కల్పింతుంబొ మ్మాయా వేళలనంచు – నా శపధమేమాయె సమస్త ప్రజా శ్రేయో ఘాతిపరశ్శతాధికరిపు శ్రేణి విదారింపంగ నెప్పుడు.

3.అప్పుడెగాని యిప్పుడది యక్కరరాని ప్రతిజ్ఞయాయెనో చెప్పుటగాదు చేయవలె – చేతకు మాటకు పొంతనంబులే కొప్పమి యీ సరాధముల కుండిన నుండగ వచ్చుగాక – యీ తప్పిదమా పరాత్పరుడె తానెటు లాడగనేర్చె నీశుడై

4.ఈశ్వరుడాడె ననిగాదు – ఈశుడాడె నని యొకానొక మహితాత్ము డనినమాట మహితచిత్తుడె గావచ్చుమౌనివర్య డైన గావచ్చు. నతడును మనవుండె.

5.మానవు లందరీ జగతి మారణయంత్ర కృత ప్రమాద వీ క్షానాల దగ్ధచిత్తులయి యాత్మలనిట్టు తపించి యుందు – రీ శానుడె రామకృష్ణ త ను సంహతి దాల్చి కృతావతారుడై యీ నరరూప రాక్షసుల నెల్లవధించె నటంచు నార్తులై

6.ఈ విధమున వారికి గల యా వేదన కధల నల్లి వ్యక్తము చేసెం గావలయును వాల్మీకియు నా వేదవ్యాసుడును మహాద్భుత ఫణితి

7.అంతియకాని యీశ్వరుడె యార్తజనావను డుండెనేని యీ వంతున శాస్త్రవేత్తలును పాలక వర్గము తోడు దొంగలై దొంతరలైన యస్త్రములతో భువనాంతర జీవకోటి ది. గ్భ్రాంతులంజేయగా తనది గాదని యూరక చూచుచుండునే.

8.మరి యీ సృష్టికి న్యాయ మేమిటిక ధర్మం బేమిట ప్రశ్నకు సరిగా నుత్తర మిచ్చుటెవ్వరికినే సాధ్యంబుగా - దింతకు సరిపెట్టన్వలె పూర్వజన్మకృత దుష్కర్మాను రూపంబె యీ పరితాపంబని - యుక్తి యుక్తముగ తోపంబోవ ద వ్యాక్యము

9.సకల ప్రాణులు నొక్కమాటుగ వినాశం బొంద - వారెల్ల నిం తకు ముందేకముగా నొకేయొక మహాదౌష్ట్యంబు గావించిరో అకలంకంబగు గాదె యందరకు నాద్యంబైన జన్మంబు - దా నికి తర్వాత కళంక మెట్లొదవె - నందెట్లేర్పడె భేదము

10.పాపపుణ్యంబులును సమభాగమైన మనుజ జన్మంబు ప్రాప్తించు ననుచు జెప్పు శాస్త్ర - మటులైన మృగపక్షి జాతికంటె హీనమగు మానవుల జాతి యెట్టులొదవె

11.పరమనికృష్ట జీవులని భావన సేయు సరీసృపంబులు తరువులు - పక్షులు మృగవితానము చూడగ నొండొకళ్ళతో నరమరలేక చాలవర కాదర మొప్పగ జీవయాత్రలో నిరతము సాగిపోవ నది నేరని మర్త్యుడుమేటి యెట్లగు

12.మన సొక్కటి యుండగనే గన నేరడు ఘనత - యుండగా వలయు వివే చన యందురు మన పెద్దలు. మను జున కదిలేక యెట్లు మహి జనియించె.

13.కొందరకీ వివేకమొన గూడియు లేదు సుఖంబు - పుట్టువుం జెందిన యప్డు - రేపు మృతిజెందిన యప్పుడు కోలుపోవుచో నందరు మానవుల్వలెనె యంత వివేకము కోలుపోయి యీ బొందిని మాత్రమే విడిచిపోయిరి సర్వము శూన్యమన్నటుల్.

14.కావున దీనికంతటికి కారణమేమని పట్టుచూచిన భావన కందరానిదని భావనచేసియె తద్ఞులందరు నీవనుకొన్న దంతయు ననిర్వచనీయ మటంచు బల్కి-రీ భావముతోడం జూడనిక ప్రశ్నయె లేదని తోచునెమ్మది

15.ఐవను ప్రశ్న వేయుటకు నా స్పద మున్నది - నిర్వచింపగా దీనిన శక్యమన్న - మరిదేనికి శక్యము - భావమున్ననే గాని యభావమంచు పలుకం జన - దింతకు నిర్వచింపగా దేనిని జూచి చెప్పెదరు - దీని న నిర్వచనీయ మంచిటుల్

16.సర్వము కాదు పొమ్మనుచు చాటిన యప్పుడికేది కావలెన్ నిర్వచనీయ - మున్న దొక నేనెగదా పరిశేష వృత్తిచే - సర్వ వి లక్షణంబయిన సాక్ష్నిని గావున నాకు గల్గదీ చర్విత చర్వణంబయిన జన్మవినాశ భయం బొకింతయు

17.అని వేదాంతులు మనకి చ్చిన యభయము - కాని సాక్షి చేతన యున్న ట్లను భవములేదు నాకీ తనువును ప్రాణంబు మనసు తప్ప విడిచిన

18.అవునదిసత్య - మీ తనువు ప్రాణము నింద్రియ చిత్తవృత్తులే నవునని చూచు నంతవర - కన్నియు నాకిటు గోచరించుచో నివి యెటు కాదు నేననుచు నించుక నీవు విమర్శ చేసితే నవలనె యుంటి వాకసము నట్లు నిరాకృతి వౌచునెల్లచో.

19.వాస్తవమయ్యు నాయనుభవంబున కేల ఘటిల్లదన్న నీ వస్తిమితుండవై కనునదంతయు కాంచెడునేనటంచు వ్య త్యస్తము గాగ చూచుతయె అందులకుంగల కారణంబు - నీ వాస్తవమైన రూపమున వాప్తము సేయక విస్మరించుటే.

20.అసలగు రూపమున్ మరచి నప్పుడు నీకదె అన్యరూపమై మొసలుట తధ్య - మెట్ల నిన మేదినిపై బడు సూర్యరశ్మినీ విసుకపరం గనుంగొనిన నెత్తుగలేచిన యెండమావులై వెస భ్రమగొల్పుగాదె - యి వి వేలును లక్షలు జీవితంబులో.

21.నేనని యసలగు నాత్మ జ్ఞానము లేకునికి నదియె కాయము గా నీ ప్రాణేంద్రియములు గా నీ మానసముగ తోచు చుండె మహి సర్వముగా.

22.ఇదె సంసారంబను పేరిట గుదిబండయి మేదకుంజుట్టు కొనియెను నీకున్ వదలదు నీ య జ్ఞానము వదలక పీడించు చుండువరకును సుమ్మీ

23.జ్ఞానమె నా స్వరూపమని చాటిన యప్పుడు. దాని నేనెటుల్ కానక విస్మరించితి - నఖండచి దాత్ముడనయ్యు నింద్రియ ప్రాణ మనశ్శరీరముల బంధములో నెటుచిక్కుకొంటి నో దీనికి నేమిటుత్తరము తెల్పుమటం చడుగం దలంచినన్

24.దానికి నుత్తరం బిడిరి తద్ఞులు నీకిపుడున్న యట్టి యీ జ్ఞానము నిర్విశేషమగు జ్ఞానము కాదు -విశేషరూపమీ జ్ఞానము - కానిచో నడుగంజాలవు నీవొక ప్రశ్న దానికి నేనును నుత్తరం బొసగనేరను సుమ్ము యధార్ధ మారయన్

25.ఇది యెటులన్న ప్రశ్న యెపుడేర్పడెనో యపుడే యఖండతా స్పదమగు నీ స్వరూపమును బాసి తి - వప్పుడెనేను నాదిగా జెదరి సఖండమై యొకటి జీవుడు వేరొకటీ జగత్తుగా సదమదమౌచు జూచెదవు సంసృతియన్ మృగతృష్ణికాంభమున్

26.కావున వృత్తులేవియును కల్పన చేయక జ్ఞాన మాత్రమే నీవని చూతువేని ఒక నీవననేల సమస్త లోకమున్ నీవయితోచు - నప్పుడిక నేనును నాదను ద్వైత భేదసం భావనయే యభావమయి బంధ నివృత్తి తనంత నేర్పడున్.

***