నామం | అంతరార్థము |
---|---|
మాధవః మధుసూదనః |
దానితో మాధవుడయ్యాడీ జీవుడు, మా అంటే ప్రాపంచికమైన సంపద. దాన్ని పోగుచేసుకున్న ధవుడితడు, ధవుడంటే నరుడని ఒక అర్థం. ఇది మధువులాగా ఎంత ఆర్జించినా సుఖంలేదు. ఆరోపితమే గనుక ఎప్పటికీ మనకు దక్కదిది. కనుకనే దీన్ని ఎప్పటికప్పుడు సూదనం- నిర్మూలనం చేసి మనకు కనువిప్పు చేస్తున్నాడా మాధవుడు. |
ఈశ్వరః విక్రమీ ధన్వీ మేధావీ |
ఈశ్వరుడాయన, ఈ మధువును కల్పించిన వాడాయనే. దీన్ని కల్పించటానికెలాగో నిర్మూలించటానికీ అలాగే ఉందాయనకు సామర్థ్యం. విరుద్ధమైన క్రమం విక్రమం. పరస్పర విరుద్ధమైన పోకడ పరమాత్మది. మనకంతుపట్టదు. ధన్వమంటే మరు భూమి. అలాంటి ఆభాసరూపమైన లక్ష్మినెందుకు సృష్టించాడా ధన్వి - మేధావి గనుక. మేధా అంటే మాయాశక్తి. అది కలవాడాయన. |
విక్రమః క్రమః |
అది విక్రమమూ క్రమమూ రెండు మార్గాలలో ప్రసరించగలదా శక్తి. విక్రమం సృష్టి - క్రమం సంహారం. |
అనుత్తమః దురాధర్షః |
ఏమిటది ఎందుకని అడిగేవాడు లేడు. అంతకుమించిన (ఉత్తమ) వాడుంటే గదా. అనుత్తముడాయన. అంతేకాక దురాధర్హుడు, తేరిచూడ లేరెవ్వరూ. ఏకమే వాద్వితీయం గదా. ఎవరున్నారని. |
కృతజ్ఞః కృతిః |
అయితే ఇంతేనా మనగతి. పరవాలేదు. మనం చేసే ప్రతిపనీ (కృత) కనిపెడుతూనే ఉన్నాడాయన. కృతజ్ఞుడే కాదు. కృతికూడా. |
Page 14