కారణమన్నారు బౌద్ధులు. అసలేదీ గాదు. దానిపాటికది సహజంగానే తయారయి ఉందన్నారు స్వభావవాదులు. ఇవన్నీ కొట్టేశారు బాదరాయణులు. ప్రకృతి అంటే అచేతనం గదా. దానికి సృష్టి చేయాలనే సంకల్ప మెక్కడిది. మరి పరమాణువులు పోగయిగదా సృష్టి జరగవలసింది. వాటిని పోగు చేసిన వాడెవడు. స్వభావ మంటారా. దానిపాటికది జరగాలంటే అది ఇప్పుడు కూడా జరగాలి గదా. ఏదీ ఏ ఒక్క అచేతన పదార్ధమూ చేతనం సహాయం లేకుండా కదలిపోవటం లేదు గదా. ఇక అభావమే కారణమంటారా. అభావమంటే లేనిది గదా. లేని దానిలో నుంచి ఉన్నది ఎలా వస్తుంది. పైగా ఆ వచ్చిన ప్రపంచాన్ని ఉందనే చూస్తున్నాము గదా. కార్య ప్రపంచమున్నప్పుడు దాని కారణం లేనిదెలా అవుతుందని నాలుగింటినీ త్రోసిపుచ్చారు.
అంతేగాదు. చేతనమైన పరమాత్మే దీనికి కారణమన్న ప్పుడెలాంటి కారణమది. నిమిత్తమా ఉపాదానమా. నిమిత్తమంటే చేతనం. ఉపాదానమంటే అచేతనం. కుండకు కారణం చేతనుడైన కుమ్మరీ కారణమే. అచేతనమైన మట్టీ కారణమే. రెండూ ఉండాలి. ఇక్కడ రెండూ వేరుగా లేవు. నిమిత్తోపాదానాలు రెండూ పరమాత్మే ప్రపంచానికి. కనుకనే ప్రపంచానికెంత అతీతమో అంత దగ్గరగా ప్రపంచంలో ప్రతి అణువూ మృత్తికలాగా వ్యాపించి ఉన్నాడు. ఇదీ బాదరాయణులు చేసిన సమన్వయం.
Page 29