#


Index

  ప్రత్యక్షాది ప్రమాణాల కతీతమైన అర్థమేదో దాన్నే బోధిస్తుంది ఆగమం. అతీతం కాకపోతే ఆగమందాకా పోనక్కరలేదు. ప్రత్యక్షాదులే చాలు. ప్రస్తుత మీ భూమ్యాదులన్నీ లేవని గ్రహించాలంటే అది ప్రత్యక్షాదులవల్ల గ్రహించే విషయం కాదు. ఎందుకంటే ప్రత్యక్షాది ప్రమాణాలకీ ప్రపంచమంతా ఉన్నట్లే అనుభవానికి వస్తున్నదిగాని లేనట్టుగా రావటంలేదు. అంచేత శాస్త్రంవల్లనే తెలుసుకోవలసిన సత్యమిది. కనుకనే లేదు లేదని శాస్త్రమార్గంలోనే చాటుతున్నారు జగద్గురువులు.

  అయితే శాస్త్రమెంతగానైనా చాటించవచ్చు. అంత మాత్రాన అది మనకు విశ్వసనీయమెలా అవుతుందని మరలా ఆక్షేపణ వస్తుంది. ఏదైనా ఒకటి విశ్వసించాలంటే అది మానవుడికి అనుభవానికి రావాలి. అనుభవానికి రాకపోగా ఇది అనుభవ విరుద్ధంగా కనిపిస్తున్నది. మనందరి అనుభవమూ చూస్తే ఈ ప్రపంచమూ ఈ ప్రపంచ వ్యవహారమూ అంతా ఉన్నదేగాని ఏదీ లేకుండా పోలేదు. అలాంటప్పుడనుభవదూరమైన మాట చెబితే మనం దాన్ని ఎలా విశ్వసించటం? ప్రస్తుతం శాస్త్రం చెప్పేమాట సర్వమానవుల అనుభవానికి దూరంగానే కనిపిస్తున్నది. అంచేత అనుభవానికి సరిపోయేలాగా దీనినెలా అర్ధం చేసుకోవాలని ఇప్పుడు ప్రశ్న.

  ఈ ప్రశ్నకు సమాధానమే భాష్యకారులు మూడవ పాదంలో బయట పెడుతూ వచ్చారు. ఈ పాదం హేతు దృష్టాంతాలను నిరూపణ చేస్తుంది. శాస్త్రం ఆగమరూపంగా చెప్పిన విషయాన్ని హేతు దృష్టాంతాలనేవి బలపరుస్తాయి. వాటి సహాయం లేనంతవరకూ శాస్త్రవచనం నదీతీరంలో ఫలవృక్షాలున్నాయన్నట్టు కేవలం ఒక ఐతిహ్యంగానే నిలిచిపోతుంది. అలాంటి వాక్యాన్ని మనం నమ్మితే నమ్మవచ్చు. లేకుంటే లేదు. అలాకాక మనకు తప్పక నమ్మకం కలగాలంటే దాన్ని హేతు దృష్టాంతాలతోనే సమన్వయించి చెప్పాలి. ఇందులో హేతువనేది అనుమాన ప్రమాణానికి జవాబు చెబితే దృష్టాంతం ప్రత్యక్షానికి చెబుతుంది. మానవుడి పరిధిలో ఉన్న ప్రమాణాలివి రెండే. కారణమేమంటే ఇవి రెండే జ్ఞానసాధనాలు మనకు. ఒకటి అంతరింద్రియమైన మనస్సు మరొకటి బహిరింద్రియాలైన చక్షురాదులు. ఇందులో మనసునే అనుమానమన్నాము. చక్షురాదులనే ప్రత్యక్షమన్నాము. ఈ రెండింటి స్థాయికీ దిగివస్తే చాలు దేనినైనా మనం నమ్ముతాము. ప్రస్తుత మనాత్మ జగత్తును నిషేధించే వాక్యం ఆగమ రూపంగా ఉన్నంతవరకూ అది మనకతీతమే.

Page 14