#


Index

  కారణగుణాలే దాని కార్యం లోనూ సంక్రమిస్తాయనే తార్కికుల సిద్ధాంతం మన మిప్పుడీ ప్రపంచ సృష్టికి కూడా అన్వయించుకోవచ్చు. ప్రపంచమనేది కార్యం. ఇది దేనివల్ల జన్మించిందో, ఆ చైతన్యం దీనికి కారణం. అయితే దానినుండి ఇది జన్మించాలంటే దానికీ దీనికీ మధ్య మరియొక పదార్థముండాలి. ఉంటేనే ఆ చైతన్య మీ ప్రపంచంగా మారగలిగేది. అదే దాని శక్తి కారణం-శక్తి-కార్యం- అని మూడుగా చెప్పుకొంటున్నా కారణ గుణాలే దాని శక్తి ద్వారా కార్యప్రపంచంలో సంక్రమిస్తాయి. బీజ లక్షణాలేగదా వృక్షంలో సర్వత్రా వ్యాపించి కనిపిస్తున్నది. అలాగే చైతన్య లక్షణమే మాయా శక్తి ద్వారా ఈ ప్రపంచంలో ప్రవేశించి తీరాలి. ప్రవేశించిందన్నప్పుడిక ప్రపంచమంతా చైతన్యమే. పోతే ప్రపంచమని మనం చూస్తున్నది వట్టి ఆభాసే అబద్దమే.

  ఈ సత్యాన్ని నిరూపించటానికి రెండు చక్కని దృష్టాంతాలను సెలవిస్తున్నారు స్వామివారు. అందులో మొదటిది మాయావి దృష్టాంతం. మాయావి అంట ఐంద్ర జాలికుడు. గారడీవాడు “మాయావీవ విజృంభయతి”. ఒక గారడీవాడు లోకుల కళ్ళు కప్పి తన గారడీనంతా ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తుంటాడు. చిత్రవిచిత్రమైన వస్తువులూ, వాహనాలూ సృష్టిస్తాడు. ఆకాశంలో ఒక గంధర్వ నగరాన్నే నిర్మిస్తాడు. అదంతా యదార్ధంగా ఉన్నట్లే జరుగుతున్నట్లే విస్తుపోయి దర్శిస్తుంటారు ప్రేక్షకులు. కాని చూపినట్టే చూపి వాడదంతా ఉపసంహరించి పోయాడంటే ఏమీ మిగలదు. వాడి పాటికి వాడొక్కడే తేలుతాడు. మరి ఆ కలాపమంతా ఎక్కడిది? అది వాడి శక్తి ప్రభావమే నని సమాధానం.

Page 26