• English
    •  

సంధ్యా వందనము-గాయత్రీ మంత్రార్థము


సంధ్యా వందనము

పూర్వార్థము

గాయత్త్రీ వ్యాహృతి స్సంధ్యా అని అమ్మవారిని కీర్తించాడు హయగ్రీవ మహర్షి. అంచేత సంధ్య ఎవరో గాదు. గాయత్త్రే. ఆ గాయత్త్రి కూడా ఎవరో గాదు. లలితా దేవే. అంటే పరమాత్మ తాలూకు మహాశక్తే. ఆ శక్తి కాల స్వరూపిణి. కాలమంటే కదిలేది. కనుకనే అమ్మవారికి కాలీ అని పేరు వచ్చింది. మహాశక్తి గనుక మహాకాలి అని అన్నారు. అచలమైన తత్త్వం నుంచి చలించి వచ్చిందా మహాశక్తి. పరమాత్మ అచల స్వరూపుడు. సర్వవ్యాపకమైన తత్త్వమెలా చలిస్తుంది. పరిపూర్ణమూ పరిశుద్ధమైన జ్ఞానమది. అలాంటి జ్ఞాన స్వరూపం నుంచి క్రియారూపంగా బయలుదేరిందా శక్తి. అది అచలమైతే ఇది చలం. చలించి పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ అని నాలుగు దశలలో క్రిందికి దిగి వచ్చింది. వచ్చి అదే చివరకు వైఖరీ రూపమైన ఈ ప్రపంచంగా కనిపిస్తున్నది. కనుక మనం చూచే ఈ చరాచర ప్రపంచమేదో గాదు. నిరంతర భ్రమణ శీలమైన ఆ మహాశక్తే.

ఇలాటి కాలస్వరూపిణి అయిన మహాశక్తిని మనమావాహన చేసుకొని దాన్ని నిత్యమూ ధ్యానిస్తూ పోతే మరలా ఇది మనల నా మూలతత్త్వం దగ్గరికి చేర్చగలదు. ఏది ఎక్కడి నుంచి వస్తుందో అదే మరలా మన బుద్ధి నా స్థానం చేర్చటాని కాలంబనం. కనుకనే మనం సంధ్యను వందనం చేయాలి. సమ్యగ్ధ్యానమే సంధ్య అనే మాట కర్థం. చక్కగా ధ్యానం చేస్తే అది సంధ్య. సంధిలో వచ్చేది గనుక సంధ్య అని కూడా పేర్కొన్నారు. సర్వకాల సర్వావస్థలలోనూ ధ్యానం చేయవలసిందే. కారణమేమంటే సర్వ కాలాలూ సర్వావస్థలూ కూడా ఆ మహాశక్తే వ్యాపించి ఉంది. అంచేత ఎప్పుడూ ఏ దశ అని ప్రశ్నే లేదు. ఏ కాలంలో చేసినా అది మనకు ఫలితమిస్తుంది. ఈ కాలమనేది భూత భవిష్య ద్వర్త మాన రూపంగా విభజించి వ్యవహరిస్తున్నామే. ఇది ఆ దేవత బాహ్య రూపం. దాని ఉపాధి. ఈ ఉపాధి రూపంగా ఏది అభివ్యక్తమవుతున్నదో అది దేవత. కాబట్టి ఆ కాలాధి దేవత నీ కాలం ద్వారా మనమందుకోవాలి. అదే ఆరాధన. ఉపాసన. వందనం. సంధ్యావందనం.

కాలం ద్వారా పట్టుకోవాలంటే ఏమిటర్ధం. మనమందరమూ పుట్టిందీ బ్రతుకుతున్నదీ చివరకు కన్ను మూసేదీ కాలంలోనే. కాలాన్ని దాటిపోలేము. కాలాధీనులం మనం. కాలరూపిణి అయిన ఆశక్తి క్షేత్రంలోనే మన జీవితమంతా సాగిపోతున్నది. అదే మన శరీరంగా ఇంద్రియాలుగా ప్రాణంగా మనస్సుగా ఇలా భాసిస్తున్నది. మనమే సాధన చేయాలన్నా మనస్సుతోనే. ఈ మనస్సు కూడా చలిస్తుంటుంది. అమ్మవారు చలించే గదా అసలు మన దగ్గరకు వచ్చింది. ఆవిడ మనోరూపంగా మనస్విని మనోమయి అయి మనలో చేరింది. మనలో ఉన్న దావిడే గనుక మనోవృత్తి ద్వారా ఆవిడ స్వరూపాన్ని పట్టుకోటం చాలా సులభం కూడా. సులభా అనే పేరు కూడా ఉందమ్మ వారికి. మరి దుర్లభా అనే నామం కూడా ఉంది గదా అంటే తదాకారంగానే భావన చేస్తే సులభ. తద్భిన్న రూపంగా భావిస్తే దుర్లభ అని అర్థం చేసుకోవాలి మనం.

ప్రస్తుతం తదాకారమైన మనోవృత్తితో ధ్యానం చేయట మెలాగో నిరూపిస్తున్నదీ సంధ్యావందన మనే ప్రక్రియ. ఇందులో మూడు భాగాలున్నాయి. మొదటి దా దేవత నా వాహన చేయటం. రెండవది దాని నుపాసన చేయటం. మూడవది దాని నుద్వాసన చేయటం. అయితే ఉద్వాసన చేస్తే ఆ దేవత మన దగ్గర లేకుండా పోతుంది గదా. ఆ శక్తి నెప్పుడూ సాధకుడు తన దగ్గర ఉంచుకోవాలి గాని దూరం చేసుకోట మేమిటని ప్రశ్న. ఉద్వాసన అనేది తాత్కాలికమే. మరలా మనకు ప్రత్యక్ష మవుతుంది. నిత్యమూ ప్రత్యక్ష మయి ఉండాలి గాని మరలా ప్రత్యక్షం కావట మేమిటని అడగవచ్చు.

ఉద్వాసన అనేది పైకి శబ్దరూపంగా చేస్తున్నాము మనం. అంతేగాని నిశ్శబ్ద రూపంగా ఆ దేవతా ప్రభావం మనసులో ఉంటూనే ఉంటుంది. సంస్కార రూపంగా ఉన్న దాన్నే రెండవ రోజు శబ్ద రూపంగా ఆవాహన చేస్తామన్న మాట. అంచేత అవ్యక్తంగా ఉన్న శక్తిని అప్పుడప్పుడు వ్యక్తం చేసుకొని దర్శించటమే మనం చేసే వందనం. చేసినా చేయక పోయినా అవ్యక్త రూపంగా నీ దగ్గరే నీ మనసులోనే ఉందది. మనోమయి గదా లేకుండా ఎలా పోతుంది. ఇదీ ఇందులో ఉండే అంతరార్థం.

కాబట్టి సర్వకాలాల్లో నని కాకపోయినా కనీసం మూడు కాలాల్లో నైనా చేయవలసిన బాధ్యత ఉంది మానవుడికి. ఆ మూడు కాలాలకూ మూడు సంధులని పేరు. సంధి అంటే రెండింటి కలయిక. ఏమిటా రెండూ. పగలూ రాత్రీ. రాత్రి పోయి పగలు వచ్చే సంధి ప్రాతస్సంధి. పగలు పోయి రాత్రి వచ్చే సంధి సాయం సంధి. అలాగే పూర్వాహ్ణం పోయి అపరాహ్ణం వచ్చే సంధి మాధ్యాహ్నిక సంధి. ఈ మూడు సంధులలో ఆ దేవత అభివ్యక్త అవుతుంది గనుక సంధ్య అని పేరు వచ్చిందా దేవతకు. అలాగే ఈ త్రిసంధులలో చక్కగా ధ్యానం చేస్తే మనం కోరిన ఫలాన్ని అందజేస్తుంది గనుక కూడా సంధ్య అని పేరు వచ్చింది. సమ్యగ్ధ్యానం చేస్తే సంధ్య. లేక సంధిలో ప్రకటమైతే సంధ్య. ఏ అర్థం చెప్పుకొన్నా సరిపోతుంది.

సంధి అనే దాని కెందు కింత ప్రాధాన్య మిచ్చారంటే అసలు సంధి అంటే ప్రాతః కాలం సాయంకాలమని కూడా కాదు. అది కేవలం బాహ్యార్ధమే. అంతరార్థం వేరే ఉన్నది. మనసులో ఒక వృత్తి పోయి మరొక వృత్తి ఏర్పడే మధ్యకాలం సంధి. అది ఒక్క క్షణమైనా ఉంటుందో లేదో. ఆ క్షణంలో ఆ వృత్తీ లేదు. ఈ వృత్తీ లేదు. రెండూ నివృత్తి అయిపోయి ఒక ఖాళీ ఏర్పడుతుంది మనసులో. అప్పుడున్నది సాక్షిరూపమైన మన చైతన్యం తప్ప మరొక భావమేదీ మిగలదు. ఇలా ఆ శుద్ధ చైతన్యాధి దేవత ఈ చిత్త వృత్తుల రాకపోకల మధ్య కాలంలోనే ప్రకటమవుతుంది గనుక దీని నొక బాహ్యమైన సంకేతంగా భావించి సేవిస్తుంటాం. ఇదీ విషయం. ఇలాటి భావన అనండి. ధ్యాన మనండి. మనం దానినెలా చేయాలో వర్ణిస్తున్నది మంత్రం మనకిప్పుడు.


Back Next





     All Rights Reserved by M.Sudhakar  - 9440524168