సంధ్యా వందనము-గాయత్రీ మంత్రార్థము
ఉపశ్రుతి
మన వేద వాఙ్మయం రెండు భాగాలు. ఒకటి ప్రవృత్తి. మరొకటి నివృత్తి. ప్రవృత్తి క్రిందికి వస్తుంది కర్మ కాండ అంతా. పోతే ఒక్క జ్ఞానమే నివృత్తి క్రిందికి వస్తుంది. అందులో కర్మ అనేది ఒకటి గాదు. శాస్త్రోక్తమైన కర్మలు నాలుగు విధాలు. అవే నిత్యనైమిత్తిక కామ్య నిషిద్ధాలు. నిషిద్ధ కర్మలు ఇటు కర్మిష్ఠులకూ పనికి రావు. అటు జ్ఞానులకూ పనికి రావు. అవి ఎప్పుడూ వర్జనీయమే. వర్జనీయమని చెప్పటానికే వేదమవి గూడా పరిగణించింది. పోతే మిగిలిన విక నిత్య నైమిత్తిక కామ్య కర్మలు. అందులో కూడా జ్ఞానులకూ జిజ్ఞాసువులకూ అవి కూడా నిషిద్ధ కర్మల లాగా వర్జనీయమే. కర్మిష్ఠులు మాత్రం చేస్తే చేయవచ్చు. మానితే మానవచ్చు. వారి వారి కామాన్ని బట్టి ఉంటుందది. కాని నిత్యనైమిత్తికాలు మాత్రమలా మానటానికి లేదు. చేసి తీరవలసిందే. ఆత్మ జ్ఞానమే పరాయణంగా పెట్టుకొన్న జిజ్ఞాసువులకూ జ్ఞానులకూ మాత్రమలాటి నిర్బంధం లేదు. కర్మిష్ఠులకు కామ్యకర్మ లెలా వైకల్పికమో Optional అలాగే జ్ఞానులకూ జిజ్ఞాసులకూ నిత్య నైమిత్తికాలు కూడా వైకల్పికమే. చేసినా చేయకున్నా నష్టం లేదు. తామెంచుకొన్న జ్ఞానమార్గంలో ఉండకపోతేనే నష్టం. అప్పుడటు కర్మకూ ఇటు జ్ఞానానికీ రెంటికీ చెడ్డ రేవళ్లవుతారు. ఇలా ఇద్దరికీ ఆస్తి పంచి పెట్టింది వేదం.
కాగా ఇప్పుడీ సంధ్యా వందనాది కర్మలన్నీ నిత్యకర్మల క్రిందికి వస్తాయి. అహరహ స్సంధ్యా ముపాసీత. ప్రతి దినమూ మూడు పూటలా సంధ్యా వందన మాచరించాలి అని విధించింది శాస్త్రం. ఎవరా ఆచరించవలసిన వారంటే త్రైవర్ణికులన్నారు. బ్రహ్మక్షత్త్ర వైశ్యులే త్రైవర్ణికులంటే. వారు సంధ్యోపాసన చేసి తీరాలి. ఉప నీతులైన పెద్దలూ పిన్నలూ మనలో చాలామంది అలా పాటిస్తున్నారు కూడా. కాని కేవలం యాంత్రికంగా చేస్తున్నారా కర్మ. ఏదో మన పెద్దలందరూ ఇలా చేస్తూ వచ్చారు మనమూ ఇలాగే నడుచుకోవాలది మనకూ మన కుటుంబానికీ మంచిదని చేస్తున్నారే తప్ప తాము చదివే మంత్రాలేమిటో చేసే అనుష్ఠానమేమిటో దాని అర్థం తెలిసి కాదు. నూటికి తొంభయి మంది కర్థ జ్ఞానమే లేదు. అర్థం దేవుడెరుగు. అసలు శబ్దోచ్చారణమే సరిగా చేయటం లేదు. తత్సవితుః అనే మాటలు విడగొట్టి తత్స - వితుః అని ఒకడుచ్చరిస్తే వితుః అని కూడా కాక తత్స - పితుః అని మరొక డుచ్చరిస్తున్నాడు. మనచేత వ్రతాలూ అవీ చేయించే పురోహితులనూ దేవాలయాల్లో మంత్రాలు చదివే అర్చక సార్వభౌములనూ గమనిస్తే మీకే తెలుస్తుంది. చాలా వరికిదే వ్యవహారం.
అసలు అర్థం లేని చదువు వ్యర్ధమన్నారు. వేదంలోనే ఒక మాట ఉన్నది. స్థాణు రయం భారహరః కిలాభూత్ - అధీత్య వేదం న విజానాతి యో-ర్థమ్. అర్థం తెలియకుండా ఎవడు వేదాధ్యయనం చేస్తుంటాడో వాడు కేవలం వేద శబ్దభారాన్ని మోస్తున్నాడు. బరువు మోసే కూలి వాడెలాటి వాడో వీడూ అలాటి వాడే. యదధీత మవిజ్ఞాతం - నిగదేనైవ శబ్ద్యతే - అనగ్నా వివ శుష్కైధో - నత జ్జ్వలతి కర్హిచిత్ - ఊరక మంత్రా లేకరువు పెడుతుంటాడే గాని అర్థజ్ఞానం లేదు వాడికి. వట్టి కట్టెలెన్ని పోగు చేసి వాటినెంత పొగ గొట్టం పెట్టి ఊదితే ఏమి ప్రయోజనం. నిప్పు కణిక వేయకపోతే మండుతుందా. నిప్పు కణిక లాంటిది జ్ఞానం. అది లేని మాటలన్నీ శుష్కమైన కట్టెల లాంటివేనని చీవాట్లు కూడా పెడుతున్నది శాస్త్రం. కాబట్టి శబ్దోచ్చారణ చేస్తున్నావంటే అది ఏమి చెబుతున్నదో దాని అర్థం మీద కూడా చూపుండాలి నీకు. అయితే అర్థజ్ఞానం లేకున్నా శబ్దోచ్చారణ చేస్తూ కర్మ లాచరించినా ఫలితముందని మహా అయితే జ్ఞానంతో చేస్తే వీర్యవత్తరం భవతి అని కూడా చెప్పింది గదా వేదమని అడగవచ్చు. అది మరీ మనం బద్ధకిస్తామని మనచేత కర్మలు యధావిధిగా చేయించాలని చెప్పిన ప్రశంసా వాక్యమే గాని యధార్ధం కాదు. అదే యధార్ధమైతే ముందు చెప్పిన మాటల కర్థం లేదు. కాబట్టి శబ్దార్ధ జ్ఞాన మనేది ఆవశ్యకం.
దీనిబట్టి పదక్రమ జటాఘనలు చెప్పుకొని మహా పండితులమని విర్రవీగే చాలామంది వేద పండితులు కూడా ఎంత పండితమ్మన్యులో మీరే ఊహించవచ్చు. వారు వేద మీ మూల నుంచి ఆ మూల వరకూ చిలుక పలుకులాగా వల్లె వేస్తున్నారే తప్ప అంతకన్నా ఏమీ లేదు. అదేమిటి. ఉదాత్తాది స్వరంతో చదువుతుంటారు గదా. ఇటూ అటూ తిప్పి తిప్పి పదాలు శ్రావ్యంగా చదువుతారు గదా అంటే దానికి మనం మూర్ఛపో నక్కర లేదు. పూర్వకాలంలో అచ్చు యంత్రాలు లేవు. కాగితాలు లేవు. అంచేత వేద మంత్రాలు కంఠస్థం చేయవలసి వచ్చింది. ఆ చేసేటపుడవి ధారణలో నిలవాలంటే స్వరం మార్చి అటూ ఇటూ ఒకే మాట పలుమారు ఉచ్ఛరిస్తూ అవి కంఠస్థమయ్యే దాకా సాధన చేస్తూ వచ్చారు. అందుకోసం వచ్చిందీ ఘనాంత స్వాధ్యాయ మంతా. వినటానికి శ్రావ్యంగానే ఉంటుంది. సందేహం లేదు. సంగీతంలో ఒక చరణం పదే పదే సంగతి మార్చి పాడుతుంటే శ్రావ్యంగా ఉండటం లేదా. అలాగే ననుకోండి.
ఆకాలంలో నంటే అది అనివార్యమయితే కావచ్చు గాని. ఇప్పుడీ కాలంలో కూడా అలాగే చర్విత చర్వణంగా చేస్తూ పోతే ఏమి బాగు. అది కాదండీ మంత్రాలు చాలా గోప్యంగా ఉండాలి. అవి బాహాటం చేయటం మహాపచార మంటారా. ఈ రోజుల్లో అనవలసిన మాట కాదది. వేదాలన్నీ ఇప్పుడచ్చు వేసి పుస్తకాలు పంచి పెడుతున్నారు. వాటి అర్థం కూడా తమకు తోచినట్టు వ్రాసి పారేస్తున్నారు. పదిమందీ చదువుకొంటున్నారు. మనమొక వేళ మడిగట్టుకొని కూచున్నా పాశ్చాత్య పండితు లూరుకోరు. తమ భాషల్లోకి అనువదించారు. అనువదిస్తున్నారు కూడా. అంతే కాదు. గాయత్త్రి దగ్గరి నుంచి మంత్రాలన్నీ వద్దని చెవులు మూసుకొన్నా మైకులలో వినిపిస్తూనే ఉన్నాయి ఎక్కడబడితే అక్కడ. దానికేమంటారు మీరు. అనధికారులైన incompetent వారి చెవిన పడగూడదని గదా గోప్యంగా ఉంచమన్నారు. అనధికారులు విన్నా పరవాలేదు. వారి కర్ధం కాదు కాబట్టి. అర్థం కూడా వ్రాశారు గదా అంటే అది కేవలం వాచ్యార్థమే. దానితో తృప్తి పడే బాపతే కాబట్టి అప్పటికీ భయం లేదు.
ఇంతెందుకు. సాయనాచార్యుల లాంటి మహనీయులు వ్రాసిన భాష్యగ్రంధ ముందా లేదా నాలుగు వేదాలకూ. అది చాలా మంది వేదజడులు చూడకపోయినా దాని గంధమంతో ఇంతో ఉన్న వేద పండితుల కది విదితమే గదా. కాని బాహ్యార్ధ జ్ఞానమే అది. అంతరార్ధం వాళ్ళకూ తెలియదు. వీళ్లకూ తెలియదు. వాచ్యార్ధం అంతరార్ధం పరమార్ధమని అసలు అర్థమనేది మూడు భూమికలు. ఎక్కడికక్కడ ఆగిపోతే సుఖం లేదు. పరమార్ధం దాకా ప్రయాణం చేయాలి పాఠకుడు. నా వేదవిన్మను తేతం బృహంత మన్నారు. వేదార్ధ జ్ఞానం లేకుండా సర్వవ్యాపకమైన బ్రహ్మతత్త్వాన్ని ఎవడూ అర్థం చేసుకోలేడట. ఆ వేదార్ధం కూడా వాచ్యార్ధం కాదు. అంతరార్ధం కూడా కాదు. రెండింటినీ మించిన పరమార్ధం. అందుకే నహ్యన ధ్యాత్మ విత్కశ్చి త్క్రియా ఫలము పాశ్నుతే అని మనువు తెగేసి చెప్పాడు లోకానికి. పరమార్ధ జ్ఞానం లేకుండా నీవక్కడి కక్కడే ఎన్ని అర్థాలు చెప్పుకొన్నా లాభం లేదు. నీవు చేసే కర్మలకు సమగ్రమైన ఫలాన్ని నీవు ఆసించలేవని చాటి చెప్పాడాయన. బాహ్యార్ధం కేవల మీకర్మ స్వరూపాన్ని దాన్ని ఆచరించే విధానాన్ని చెబుతుంది. అంతరార్థ మాయా కర్మ లేయే దేవతల నుద్దేశించి చేస్తున్నావో వాటి స్వరూప ప్రభావాలను మాత్రమే ఏకరువు పెడుతుంది. అంతేగాని వాటికతీతమైన తత్త్వాన్ని చెప్పలేదు. అదే అధ్యాత్మ మని మనువు పేర్కొన్నది. పరమార్ధ మదే జీవితానికి. మిగతా అర్థాలు అర్థాలు కావా అంటే కావచ్చు. కాని ఎంతవరకో అంతవరకే. పరిచ్ఛిన్నమవి. పరిపూర్ణం కావు.
పరిపూర్ణమైనది ఒక్క పరమార్ధమే. ఎక్కడ ఉందది. ఎక్కడ అని ప్రశ్నే లేదు. సర్వత్రా ఉన్నది. అద్వితీయమది. ద్వితీయముంటే అది సార్వత్రికం కాదు. అలాటి అద్వైత భావమనేది ఒక్కటే పరిపూర్ణం. అందులోనే మిగతా అర్థాలూ శబ్దాలూ అన్నీ చేరిపోతాయి. అసలు ప్రపంచ మంతా అదే వ్యాపించినప్పుడు శబ్దమనీ అర్థమనీ తేడా ఏముంది. భౌతిక ప్రపంచమంతా అదే. వేద వాఙ్మయమంతా అదే. కర్మకాండ అంతా అదే. దానివల్ల ఉపాసించే దేవతలూ దేవలోకాలూ అదే. మిగతా వన్నీ దీప ప్రకాశాలైతే సూర్య ప్రకాశం లాంటిదది. అంచేత మీరు బాహ్యమని చెప్పండి. ఆంతరమని చెప్పండి. ఏ అర్థం మీరు చెప్పినా అవన్నీ ఆ పరమార్ధంలో చేరిపోవలసిందే. ఇలాటి అద్వైత దృష్టితో చేసిన వ్యాఖ్యానమే అసలు వ్యాఖ్యాన మనిపించుకొంటుంది. అలా వ్యాఖ్యానం చేసిన వాడే నిజమైన వ్యాఖ్యాత కూడా.
నా అదృష్టం కొద్దీ అలాటి వ్యాఖ్యాతల వంశంలోనే జన్మించాను నేను. ఇప్పటికి నలభయి యాభయి ఏండ్ల నుంచీ అద్వైత సిద్ధాంతాన్నే నమ్ముకొని ఆ దృష్టితోనే బ్రతుకు సాగిస్తున్నాను. ఏది చూచినా ఆ దృష్టితోనే చూస్తున్నాను. ఇటు భౌతిక జగత్తును చూచినా అదే దృష్టి. అటు వాఙ్మయ జగత్తును చూచినా అదే దృష్టి. అలాటి అద్వైత దృష్టి నేమర కుండానే ఉపనిషత్తుల దగ్గరి నుంచీ భారత భాగవత రామాయణాది గ్రంధాల వరకూ అన్నింటినీ సమన్వయిస్తూ వచ్చాను. తదను గుణం గానే అనేక గ్రంధాలు రచించి ప్రకటించాను కూడా. అవి చదివిన వారికందరికీ ఇది అనుభవ సిద్ధమే. ఇది ఎంతో మాకు విజ్ఞానదాయకంగా ప్రయోజన కారిగా ఉంది లాగే ఉండాలి ఏ వ్యాఖ్యానమైనా అని ఎంతగానో ప్రశంసిస్తూ వచ్చారు కూడా
అంచేత సార్వజనీనమైనదీ మార్గమని చెప్పి ప్రస్తుత మీ గ్రంథం కూడా నేనా అద్వైత దృష్టితోనే చూచి గంభీరమైన ఆ భావాలనన్నింటినీ యధాశక్తిగా బయటపెట్టదలచాను. సంధ్యా గాయత్త్రి అంటేనే అది బ్రహ్మ విద్య. మరి అధ్యాత్మ దృష్టితో గాక ఏ దృష్టితో చూడాలి దాన్ని. ఎక్కడ బట్టినా ఉన్న సత్యమదే అయినప్పుడది గాక ఏది చూపాలి లోకానికి. అదే ఉన్నప్పుడిక చూపటం దేనికంటారా. ఉన్నా మరుగుపడి ఉంటున్నది కాబట్టి బయటపెట్టటమే మనం చేస్తున్న పని. ఇది నేను చాలాకాలం క్రిందటనే ప్రవచనం చేశాను అక్కడక్కడా. కాని రికార్డు సరిగా కాలేదది. ఇటీవల కొందరు స్వదేశవాసులూ విదేశ వాసులూ అది గ్రంధరూపంగా వస్తే బాగుంటుందని కోరిక వెలిబుచ్చారు. అంచేత వారి కోరిక మేర కా కాసెట్టులలోని విషయం కొందరు శిష్యురాండ్రు కొంత వ్రాసి ఇస్తే మరికొంత భావన చేసి ప్రస్తుత మీ రూపంగా జిజ్ఞాసువులైన పాఠకుల కంద జేస్తున్నాను. ఇది మీకు తృప్తి నిస్తే నాకూ తృప్తే.
ఇతి
బుధ జన విధేయః
శ్రీనివాస నామధేయః
Next