#


Back

Page 98

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


98
తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః ।
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ॥ 4-42 ॥

ఇంతకూ అన్ని అనర్థాలకూ మూల కారణం మానవుడి అజ్ఞానం. అంతా భగవత్స్వరూపమే- అది నేనే- అనే పరమ సత్యం తెలియక పోవటమే అజ్ఞాన మంటే. ఈ అజ్ఞానం వల్లనే సంశయ మనేది అడుగడుగునా కొడి ఎత్తుతున్నది. కాబట్టి దానిని సమూలంగా పెకలించి అవతల పార వేయాలి.
అయితే సమూలంగా అంటే దాని మూల మెక్కడ ఉందని. ఎక్కడో దూరంగా లేదది. మనలోనే మన హృదయంలోనే పాదుకొని ఉన్నదది. హృదయమనేది ఎప్పుడూ మనల నెడబాయకుండా మనదే అయిన పదార్ధం. కాబట్టి తద్దతమైన సంశయ భూతాన్ని వెదకి పట్టుకోటం ఏమంత దుష్కరం గాదు. అయితే ఆ క్రియకు తగిన సాధనం కావాలి మనకు. అదే జ్ఞాన సాధనం. అది ఒక తీక్షణ మైన కరవాలం లాంటిది. దానితో పట్టి నరికితే ఎక్కడెక్కడి వేళ్ళూ తెగిపోతాయి సంశయమనే వృక్షానికి. అది ఒక్క వేటుకు కాకపోతే రెండు మూడు దెబ్బలకైనా నిర్మూలం కాక తప్పదు.
అయితే ఒక్కమాట. జ్ఞాన కుఠార మజ్ఞాన జన్యమైన సంశయ వృక్షాన్ని పెళ్ళగించి వేస్తుంది. మంచిదే. కాని ఈ కలిగిన జ్ఞానం మరలా తప్పిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ఉంది సాధకుడికి. లేకుంటే మరలా ఆ విషవలయం లోనే పడే ప్రమాదముంది. చీకటి లాగా పొంచి ఉంటుంది అజ్ఞానం. జ్ఞానమనే వెలుగు ఉన్నంత వరకూ అది ప్రక్కపొంచి ఉంటుంది. అది ఏమాత్రం సడలినా నేనున్నానని వెంటనే తల ఎత్తుతుంది. ఆ మేరకది అజ్ఞానానికి క్రీడాస్థలమే. అంచేత అది సడలకుందా గట్టిగా నిలవటానికి యోగాన్ని ఎప్పుడూ అభ్యసిస్తూ ఉండాలి. యోగమంటే స్వసంవేద్యతా పాదన మని లక్షణం చెప్పారు భాష్యకారులు. విషయంగా కాక విషయిగా - అంటే నేనే అది - అనే భావంతో పట్టుకోవాలి దాన్ని నేననేది నాకంటే దూరం కాదు. కాబట్టి అది కూడా దూరమయ్యే ప్రశ్నలేదు. ఇదుగో ఈ ప్రక్రియకే స్మరణమని పేరు వేదాంతంలో.