#


Back

Page 96

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


96
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ।
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం ॥ 9-2 ॥

కనుకనే మరలా మొదటికి వచ్చి మాటాడితే జ్ఞానం కన్నా పవిత్రమైనదీ - ఉత్తమమైనదీ - మరొక సాధన మేదీ లేదని చెప్పవలసి వస్తున్నది. పవిత్ర మెందుకయింది. సంసార కాలుష్యాన్ని ఏ కొంచెం కూడా మిగలకుండా దహించి వేస్తుంది గనుక. “జ్ఞాన ముత్పద్యతే పుంసాం క్షయాత్ప్సాపస్య కర్మణః” అసలు పాప కర్మ అంతా సమూలంగా నశిస్తేగాని జ్ఞానముదయించదు. కాక పోయినా సర్వమూ శుద్ధ చైతన్యాత్మకంగానే భాసిస్తూ ఉన్నప్పుడిక ఎలాంటి కల్మషానికి గానీ చోటెక్కడిది. కాబట్టి పవిత్రంలోకీ పవిత్రమది.

పోతే ఉత్తమమెలా అయింది. మంద మధ్యమ స్థాయలు రెండూ దాటి పోయింది గనుక. కర్మానుష్టానం మందులకైతే - ఉపాసనాదులు మధ్య మాధికారులకు. కాగా ఉత్తమాధికారులకు చెప్పవలసింది జ్ఞానమార్గ మొక్కటే. ఎంతో చిత్తపరిపాక మున్నవారు గాని దాని నందుకోలేరు. “యతతామపి సిద్దానాం కశ్చి న్మాం వేత్తి" అని భగగవానుడు పేర్కొనటంలో ఇదే అంతరార్థం.

ఇంత గొప్ప స్థాయికి చెందినది గనుకనే దానిని రాజవిద్య అనీ రాజయోగ మనీ - ప్రశంసించారు. మనుష్యులలో రాజులాగా విద్యలన్నిటికీ అది రాజు. అంతేగాక కళలలోకూడ రాజు. గుహ్యమంటే రహస్యం. అదే కళ. పోతే విద్య అంటే శాస్త్రం. ఒక సత్యాన్ని గుర్తించటం శాస్త్రమైతే దాని నమలు పరచటం కళ, ప్రస్తుతం సర్వమూ చైతన్యమనే విషయమే సత్యం. దానిని గ్రహిస్తే చాలు. అదే జీవితంతో కూడా నిలుపుకోవలసి వుంది. అది కళ. దానితో “బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి” అన్నట్టు తానే బ్రహ్మ స్వరూపుడవుతాడు సాధకుడు. అయితే ఇంక కొరతేముంది. సర్వసిద్ధులూ అతనివే.

ఇది నిజమా అని సందేహించ నక్కరలేదు మనం. మిగతా కర్మో పాసనల మాదిరి దీని ఫలితం మనకెప్పుడో చచ్చిన తరువాత ప్రాప్తించేది కాదు. ఇప్పుడే ఇక్కడే ఇహ జీవితంలోనే మనకు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుందని శాస్త్రమిచ్చే హామీ. ఎందుకంటే జ్ఞానం వేరు - జ్ఞేయం వేరు కాదిక్కడ. జ్ఞేయ మనుకొనే బ్రహ్మం కూడా జ్ఞాన స్వరూపమే. అందుకే దానిని పట్టుకోవడం కూడా సులభమే. రత్నవివేకం మాదిరన్నారు భగవత్పాదులు. ఎన్నో రాళ్ళమధ్య మరుగుపడి ఉన్నా ఒక జీవరత్నాన్ని గుర్తించటమెంత సులభమో అంత సులభ మట. మనం బాహ్యంగా చూచేవి - లోపల ఆలోచించేవీ - ఇవన్నీ చూస్తున్నదీ చేస్తున్నదీ ఎవరు - దేని వెలుగులో జరుగుతున్నది ఇదంతా - అని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు. నామ రూపాలకు విలక్షణంగా తన స్వరూపం ఎప్పటికప్పుడు గోచరమవుతూనే ఉంటుంది. దానికి రూపం లేదే ఎలాగ అని ప్రశ్నే రాదు. ఒక సుఖం లాగా ఉత్సాహం లాగా మనసుకు రావటానికి ఆక్షేపణ ఏముందన్నారు.