#


Back

Page 94

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


94
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా ।
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ॥ 9-4 ॥

95
న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం ।
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ॥ 9-5 ॥

మోక్షమార్గంలో ఉండే ఈ భూమికలనే చక్కగా బయట పెడుతున్నా యీ రె౦డు శ్లోకాలూ, సాధన రహస్యమంతా వీటిలోనే గుప్తమయి ఉంది. అధ్యాత్మ రంగంలో సిద్దమయిన తత్త్వాన్ని బట్టే ఎప్పుడూ సాధన అనేది నిర్ణీతమై ఉంటుంది. ఎందుకంటే సాధన వల్ల చేరవలసింది చివరకా తత్త్వాన్నే అలాంటప్పుడు సాధన దానికి విలోమంగా ఉండటం ఎలా చెల్లుతుంది.

అయితే ఈ తత్త్వ మనేది తన పాటికి తాను ఒకే రూపంలో ఉన్నా - దాని నర్థం చేసుకొనే సాధకుల దృష్టిని బట్టి అనేక రూపాలుగా భాసిస్తూంటుంది. అప్పటికి వారికదే గమ్యమవుతుంది. కాని అది వస్తు త్తత్వం కాదు. సాధకుడి దృష్టి అంతకంతకు పెరిగే కొద్దీ అదీ పెరుగుతూపోతుంది. అలా పెరుగుతూ పూర్తిగా వస్తువును సమీపించి దృష్టి నిలిచే సరి కది అప్పుడు వాస్తవమైన స్వరూపంగానే అనుభవానికి వస్తుంది.

దీనిని బట్టి చూస్తే ప్రస్తుతం అవ్యక్తరూపుడనైన నేనీ సృష్టినంత వ్యాపించి ఉన్నా నంటున్నాడు పరమాత్మ. ఇది భేద దృష్టి ననుసరించి చెప్పినమాట. ఇందులో సృష్టివేరు. స్రష్టవేరు. రెండూ సత్యమే. సృష్టిలో ఒకడుగా జీవిస్తున్న మన మీ సృష్టికంతా నాయకుడైన పరమాత్మ ఒకడున్నాడని గుర్తించి తత్సేవకుల మని భావిస్తూ తదర్ధంగా సత్మర్మ లాచరిస్తూ సత్త్వాన్ని శుద్ధి చేసుకొనే ప్రయత్నం చేయాలి.
అలా చేశామంటే సకల భూతాలూ నాలో ఉన్నాయేగాని నేను మాత్రం వాటిలో లేనని చాటుతున్నాడు పరమాత్మ. ఇది భేదా భేద దృష్టి ననుసరించి చెప్పిన వాక్యం. పరమాత్మకు సంబంధించినట్టుగా ఈ సృష్టిని చూడటమంటే గుణ విశిష్టంగా తత్త్వాన్ని భావించటమని అర్థం చేసుకోవాలి. దీనిమూలంగా సృష్టిని వేరుగా చూడక తద్విశిష్టమైన పరమాత్మ తత్త్వాన్నే పట్టుకొంటాడు. కాబట్టి సాధకుడి చిత్తానికి శుద్ధియేగాక ఏకాగ్రత కూడా ఏర్పడుతుంది.

అలా ఏర్పడ్డ తరువాత మూడవ భూమిక ఒకటుంది. ఆఖరిది కూడ అదే. “నచ మత్సాని భూతాని”: నాలో కూడ అసలవి లేవు. వాస్తవంలో ఉన్నది నేనొక్కడనే. దీనిని బట్టి పరమాత్మతత్త్వ మొకటి తప్ప సృష్టి అనేదసలు దానికి ఎప్పుడూ ఎక్కడా లేదని అర్థమవుతున్నది. ఇది కేవల మభేదదృష్టి ననుసరించి చెప్పేమాట. ఇదే అసలు పరమార్థం. అయితే ఆ ముందు చెప్పిన రెండు మాటల కర్ధమేమిటి. అవి లేవు వాస్తవంలో. అయినా లోకు లావిధంగా చూస్తున్నారు తత్త్వాన్ని. తాము చూచిందే అసలు. తత్త్వమని నమ్ముతున్నారు. కాబట్టి లోక దృష్టి ననుసరించి తాత్కాలికంగా చేసిన వర్ణన అది. కొంతకాల మలాభాసించినా క్రమంగా వారే ఎప్పటికైనా అసలు తత్త్వాన్ని అందుకోగలిగిన స్థోమత సంపాదిస్తారనీ - సంసాదించినప్పుడు వారికి బోధించవలసిందీ కడపటిదే ననీ - శాస్త్రహృదయం.

ఇందులో మొదటిదైన భేదదృష్టే కర్మయోగం. రెండవదైన భేదా భేదదృష్టే భక్తియోగం. పోతే మూడవదైన అభేదదృష్టి జ్ఞానయోగం. ఈ జ్ఞానమే అందుకో వలసింది చివరకు. దానిని చేర్చే సాధనాలే మొదట చెప్పిన రెండూ. అవీ సాధకుడికి జ్ఞానం కలిగించటానికి తాత్కాలికంగా కల్పించినవే గాని - యధార్థం కావు యథార్థం అద్వయమైన చైతన్య తత్వమే. అందులో ద్వితీయ మనే మాటకు చోటు లేదు. లేకుంటే ద్వితీయంగా మన మారోపించినంత మాత్రాన అది ఎలా భాసించగలిగిందనీ ప్రశ్న వశ్యమే యోగ మైశ్వరమ్మనే మాటలో ఉంది సమాధానం నిరుపాధికమైనా నామరూపాదులైన ఉపాధుల ననేకంగా సృష్టించే శక్తి ఉంది దానికి. అదే ఈశ్వరీయమైన యోగమాయ, తనపాటికి తాను కాకపోయినా జీవుల అవిద్యా దోష దృష్టి ననుసరించి అది చిత్ర విచిత్రంగా దర్శనమిస్తుంది. అదే ఈ సృష్టి. విభూతి అనికూడ దీనికే పేరు. అయినా ఇదంతా కల్పితమే కాబట్టి దీనిని ప్రవిలయం చేసుకొని చూచే ఆ చైతన్య తత్త్వమే అసలైన స్వరూపం. అది జ్ఞానం వల్లనే సాధ్యం. కాబట్టి ఆజ్ఞానమే అన్నింటికన్నా ప్రధానమైన సాధానం. అది ఒకటి దగ్గర ఉంటే చాలు. దానిలో మిగతా కర్మోపాసనాది సాధనలన్నీ కలిసి వస్తాయి. ప్రత్యేకంగా వీటికోస కృషి చేయనక్కరలేదు. చేసినా దానిని సంపాదించటానికే ఆ కృషి తరువాత వీటి కస్తిత్వంలేదు.