#


Back

Page 10

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)

9
యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ ।
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ॥ 2-15 ॥

     అలాంటి దృఢ నిశ్చయంతో ఉన్న ఎవడినైతే ఈ మాత్రా స్పర్శలు బాధించవో వాడికి సుఖమూ - దుఃఖమూ - అనే భావాలు రెండు సమానమే అవుతాయి. సుఖదుఃఖాలు రెండూ సమానంగా చూడగలవాడే ధీరుడు. వాడికి మరణ మనేది కూడా సంభవించదు. అమృతత్వాన్నే చూరగొంటాడు వాడు.

    అయితే ఎటు వచ్చీ అంతటి మహాయోగం పట్టాలి మానవుడికి. పట్టాలంటే దాని కొక్కటే షరతు. ద్వంద్వాలన్నీ జీవితంలో ఏ మాత్రమూ తేడా లేకుండా దర్శించటమే. అందులో ఏది ఎప్పుడు సంప్రాప్తమయినా బెదరిపోకుండా స్తిమిత మయిన మనస్సుతో అనుభవించగలిగి ఉండాలి. ఎంతో సహనముంటే గాని అది అలవడదు.

    ఈ సహనశక్తి ఎలా ఏర్పడుతుంది. నా చైతన్య మొక్కటే ఉంది సర్వత్రా. అదే సత్పదార్థం. అది తవ్ప మరేదీ లేదు ప్రపంచంలో శరీరాదులైతేనేమి. శీతోష్ణాదు లైతే నేమి - ఇవన్నీ నిజాని కసత్తులే లేనిదే మన కున్నట్లు కనిపిస్తున్నాయి. వాటి అస్తిత్వానికి నేనే కారణం నా జ్ఞానమే లేకపోతే అవి ప్రకాశించ లేవు. అవి నా జ్ఞానానికి రూపాంతరాలే. అగ్నిలో ఉండే ఉష్టమూ నేనే. దాని వలన కలిగే వేదనా నేనే. నా రూపం తోనే నాకు సంసర్గ మేర్పడుతున్నది వాస్తవానికి. అలాంటప్పుడు నాకు బాధ దేనికి, బాధపడుతున్నానంటే నన్ను చూచి నేనే బెదరిపోతున్నానని అర్ధం. తన నీడ చూచి తానే ఉలిక్కిపడినట్లున్నది. రెండూ ఒకటేననీ - అదీ నా స్వరూపమేననీ - భావిస్తే ఏ భయాలూ లేవు.

ఇలాగే శరీరం దగ్గర నుంచీ ప్రతి ఒక్కటీ లోకంలో నా చైతన్యచ్చాయే నానీడే గాని వేరు గాదని ఎప్పుడూ విచారణ చేస్తూ పోవాలి. ఆ విచారణ పరిపాకానికి వచ్చిందంటే తప్పకుండా ఏర్పడుతుంది సహనం. దానితో రేపు మరణానుభవం కూడా మనకు ప్రతికూలంగా తోచదు. అదీ మన స్వరూప మేననే భావనతో జీవితం లాగా మన కనుకూలమే అవుతుంది. అయితే మరణమే లేదు వాస్తవంలో.