#


Back

Page 8

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


8
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ।
ఆగమాపాయినోఽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ॥ 2-14 ॥

శరీరానికీ మన చైతన్యానికీ సాజాత్యమే లేదని ప్రతిపాదించాము. కాని అది వట్టి సిద్దాంతమే నేమో. ఎందుకంటే అనుభవాన్ని బట్టిచూస్తే దానికి విరుద్దంగా కనిపిస్తున్నది. చలీ - వేడీ - సుఖమూ - దుఃఖమూ ఇలాంటి ద్వంద్వాలకు మన శరీర మెప్పుడూ గురి అవుతూ ఉంటుంది. అలా గురి అవుతూ ఉందంటే ఆ అనుభవం మనది కాకపోదు. అసలు అనుభవ మంటేనే మనది. మనదంటే మన చైతన్యానిది. అచేతనమైన శరీరానిదెలా అవుతుంది. అనుభవం. చైతన్యంతో సంబంధం లేకుండా జడమైన దేహ మెప్పుడూ ఏది గాని అనుభవించలేదు. అలాగయితే నిప్పులో చేయి పెట్టి చేయి మాత్రమే కాలుతూంది గాని - నేను కాదని అనుకోగలగాలి. ఏదీ అలా అనుకో గలుగు తున్నాడా ఎవడైనా. జీవితంలోనే అనుకోలేని వాళ్ళం రేపు మరణంలో మాత్రమెలా భావించగలమని ప్రశ్న వస్తుంది.

విచారణ లేనంత వరకే ఇలాంటి ప్రశ్న మొదటనే చెప్పాము విచారణా శీలుడికి భ్రాంతి లేదని, కాని ఆ విచారణ అనేది నూటికి కోటికి ఒక్కడికి గాని ఉండదు. అందులోనూ బాగా పరిణతి చెందినవాడే ఒక్కడో గాని దొరకడు. మిగతా తొంభై తొమ్మిది మంది నిక్షేపరాయళ్ళే. అలాంటి పామర జనుల అనుభవ మేదో దాన్ని 'పురస్కరించుకొని మాట్లాడుతున్నావు నీవు. అది సార్వజనీనమే అయినా యథార్ధమైనది కాదా అనుభవం. ఎందుచేత. నీవు శీతోష్ణాలనీ - సుఖ దుఃఖాలనీ - ఏ ద్వంద్వాల అనుభవం చెబుతున్నావో అది ఆయా ఇంద్రియాల తాలూకు అనుభవమే కాని ఆత్మది కాదు. నిప్పులో చేయి పెడితే మన చర్మానికే సోకుతున్నదా వేడి. కాలినా - మాడినా - మసి అయినా ఆ చర్మమే. చర్మం వరకే ఆ మార్చు. దాని ననుభవానికి తెచ్చుకొనే చైతన్యంలో లేదా మార్పు. అది అనుభవ రూపంగానే నిలిచిపోతున్నది.

అంతేకాదు. ఈ ద్వంద్వాలు కూడా నిత్యం కావు. అనిత్యాలవి. అనిత్యాలని ఎలా చెప్పగలవు. ఆగమా పాయులు కావటం వల్ల. ఆగమ మంటే రావటం. అపాయమంటే పోవటం. రాకపోకలు చేస్తుంటాయే గాని - నిలకడగా ఎప్పుడూ ఉండవని చూడండి. నీరు మరిగి పోతుంటుంది. చేయి పెట్టటానికి భయపడ తాము మనం. అయితే అది వట్టి భయమే. నీటి కది స్వభావం కాదు. స్వభావ మయితే కొంతసేపటికి మళ్ళీ అది చల్లబడదు. అందుచేత దానిలో ఉండే ఉష్ణ గుణ మనిత్యం. దాన్ని అనుభవించే మన చైతన్యమే నిత్యం. అనిత్యాన్ని చూచి నిత్యం భయపడవలసిన అగత్య మేమిటి. అదే మాయ. ఈ మాయ వల్లనే శరీరేంద్రి యాదులను నేనని భ్రమించాము. ఆ భ్రాంతితో ఇంద్రియ సంసర్గం వల్ల ఏర్పడే కష్టసుఖాలు నావే నని అనుభవిస్తున్నాము. అయితే ఎంత అనుభవించినా భ్రాంతి మూలకమే కాబట్టి ఇది వాస్తవం కాదు.

పోతే వాస్తవికమైన అనుభవ మేమిటి. అదే విచారణా దక్షుడైన వాడి కుందని చెప్పే అనుభవం. వాడు తన స్వరూపాన్ని నిత్యమూ వేరు చేసుకొనే చూస్తుంటాడు. దాని బలంతో ఇంద్రియాలకు కలిగే స్పర్శలు తనవిగా ఎప్పుడూ అభిమానించడు. అభిమానించకపోతే ఇక వాటివల్ల మనకు బాధ లేదు. లోకంలో కూడా చూడండి. అభిమానమున్న వాడికే బాధ. లేనివాడికి లేదు. విషయేంద్రియ సంపర్కం సాధారణమే అయినా ఒకడు మనసుకు తీసుకొన్నట్టు మరి ఒకడు తీసుకోడు. ఇంకా ఒక్కొక్కడైతే ఎంతో కష్టం కలిగించే సందర్భాలను కూడా లెక్క చేయకుండా తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళను మొద్దులనీ మొరటు వాళ్ళనీ అంటాము మనం. వచ్చీపోయి ఇలాటి మొరటు తనమే అలవరచుకోవాలి మనం అధ్యాత్మ రంగంలో కూడా.
దీనికే తితిక్ష అని పేరు. తితిక్ష అంటే సహనమని అర్ధం. పిడుగు పడ్డా పర్వతం చలించదు. సహనాని కది పరాకాష్ట అలాంటి సహనశక్తే అలవడితే ఈ ద్వంద్వాలనేవి ఏమీ చేయలేవు మానవుణ్ణి. అయితే అలవడటమెలాగ. అందులోనే ఉంది మర్మం. ఈ కలిగే ద్వంద్వ బాధలన్నీ నిత్యం కావు. వస్తూ పోయేవే ఇవన్నీ, నిలిచేవి కావు. నిలిచేది సద్రూపుడనైన నేనొక్కడనే. నాకు భిన్నంగా ఇది అంతా కేవల మసద్రూపమే. అంటే వట్టిదేనని గట్టి నిశ్చయంతో వుండాలి.