#


Back

Page 74

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


74
యజ్ఞార్థాత్కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ॥ 3-9 ॥

అందుకే మనం చేసే ప్రతి కర్మా - యజ్ఞం కోసమే ననుకొంటూ చేయమని సలహా ఇస్తున్నాడు భగవానుడు. దేన్ని గురించి యజనం చేస్తామో అది యజ్ఞం. యజనమంటే ఆరాధనం. భగవత్తత్త్వాన్ని గురించే గదా ఆరాధిస్తాము. అంచేత భగవంతుడే యజ్ఞ మంటే. యజ్ఞో వై విష్ణుః- అని వేద వాక్యం. అలాంటి యజ్ఞ పురుషుడైన పరమాత్మ కోసమే ఈ కర్మ నేనాచరిస్తున్నానను కొంటూ చేయాలి ఏ పని అయినా. ఆయనే చేయిస్తున్నాడు -ఆయన కోసమే చేస్తున్నాను - ఆయనకు నేనొక భృత్యుణ్ణి అనే భావ ముండాలి మనకు. దీనితో కర్తృత్వం భోక్తృత్వాలు రెండూ మన మీది నుంచి ఎగిరిపోయి ఆ విశ్వరూపుడి మీద వాలుతాయి. తన్మూలంగా కర్మ భారం తొలగిపోయి మనం పూర్తిగా తేలిక పడతాము.

కర్తృత్వ భోక్తృత్వాలు పెట్టుకొని చేసినప్పుడే అది బంధం. అవి రెండూ లేకుండా చేస్తే ఏ కర్మా మనకు బంధకం కాదు. అయితే సాధారణంగా ఈ రెండు బుద్దులూ లేకుండా మనమే పని చేయము. చేయలేము. ఇది నేనే చేస్తున్నాను. దీని ఫలం నాకే దక్కాలనే ఉంటుంది మనందరికీ. ఇదే మన కొక వాసనగా పరిణమించి ఆ కర్మ ముగిసినా మనలను వదలకుండా కట్టి వేస్తున్నది. ఆ వాసలనతోనే మరణిస్తాము కాబట్టి పుణ్య పాపాలూ-స్వర్గ నరకాలూ- జన్మాంతరాలూ -మనకు తప్పటం లేదు. వీటి దుష్పలితం నుంచి విముక్తి పొందాలంటే ఎప్పటికైనా ముక్త సంగులమై కర్మ లాచరించాలి. అసలాచరించక పోవటమూ గాదు. సంగం పెట్టుకొని ఆచరించటమూ గాదు. వ్యక్తి గతంగా భావించి నంత వరకూ అది సంగం. కర్తృత్వ భోక్తృత్వ చింత కూడా అప్పుడే తారసిల్లేది. వ్యక్తిగా గాక విశ్వమంతా వ్యాపించిన చైతన్యమే నేనని సమష్టితో ఎప్పుడూ తాదాత్మక్యం భజిస్తామో అప్పుడా భజనమే యజన మవుతుంది. ఆ యజనంతో చేసిన కర్మ ఇక బంధకం “కానేరదు. కారణ మేమంటే దానిలోముందు చెప్పిన కర్త్శృత్వ భోక్తృత్వ దృష్టి ఉండదు. దృష్టి లేకుంటే దానికి చెందిన వాసన లేర్పడవు. వాసన లేర్చడక పోతే పుణ్య పాపాదుల ప్రసక్తే లేదు. మీదు మిక్కిలి భగవదంకితంగా చేసే ఈ శుద్ది ద్వారా అత్మ జ్ఞానానికి సులభంగా దారి తీస్తుంది.