#


Back

Page 71

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


71
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప ।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ॥ 18-41 ॥

కర్మలనేవి అసలు లౌకికమనే గాక శాస్త్రం కూడా విధించింది మనకు. నియతమంటే శాస్త్ర విహితమని కూడా అర్ధమే. శాస్త్ర చోదితమైన కర్మలెలా మానుకోగలం లౌకికం లాగా వాటిని కూడా పాటించవలసిందే మానవులు. మానవులంటే ఒకరు గారు. బ్రాహ్మణులనీ -క్షత్రియులనీ -వైశ్యులనీ-శూద్రులనీ-నాలుగు వర్ణాల వారున్నారు. ఈ నలుగురికీ నాలుగు రకాలైన కర్మలు నియతమై Fixed ఉన్నాయి. శమదమాదులూ- అధ్యయ నాదులూ- బ్రాహ్మణులకు. శౌర్యక్షమాదులూ దండపాలనాదులూ- క్షత్రియులకు. కృషి గోరక్ష వాణిజ్యాదులు వైశ్యులకు. అలాగే పరిచర్యాదికమైన కర్మ శూద్రులకు.

ఇవి ఎవరు విభజించారు ఈ వర్ణాలు ఈ వర్ణాలకీయీ కర్మలని ఎవరు నిర్ణయించారు. నిర్జీవమైన శాస్త్రం మనకు నిర్దేశించట మేమిటి. అది కూడా మానవుడు కల్పించుకొన్నదే గదా అని ఆక్షేపించరాదు. శాస్త్ర మనేది అపౌరు షేయం. పురుష బుద్ది కల్పితం కాదది. సిద్ధమైన తత్త్వాన్నే అనువదిస్తుంది Follows శాస్త్రం. ఏమిటా' సిద్దమైనదంటే అది మన స్వభావమే. స్వభావ మనేదిక్కడ ఈశ్వర ప్రకృతి అయినా కావచ్చు. లేక మానవ ప్రకృతి అయినా కావచ్చు. ప్రకృతి గుణాలైన సత్త్వరజస్తమస్సులే మానవులందరిలో పడుగుపేకగా అల్లుకొని ఉన్నాయి. ఆ అల్లిక కూడా ఒక తరహాగాదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క తీరులో ఉందది. సత్త్వం ప్రధానమయి రజస్సు అప్రధానమైతే అది బ్రాహ్మణ. రజస్సు ప్రధానమైన సత్త్వమ ప్రధానమైతే క్షత్రియ రజస్సు ప్రధానమయి తమస్సు అప్రధాన మయితే వైశ్య. మరి తమస్సు ప్రధానమై రజస్సు అప్రధాన మైతే శూద్ర.

ఇవి అనేక జన్మల నుంచీ అనుసరిస్తూ వస్తున్నాయి మనలను. ఈ గుణ భేదం వల్లనే కర్మ భేదం ఏర్పడింది. ఇది శాస్త్రం కల్పించిందీ కాదు. మానవులు కల్పించిందీ గాదు ఆ మాటకువస్తే ఈశ్వరుడూ కల్పించిందీ కాదు. “చాతుర్వర్ణ్యం మయా స్పష్ట" మని కర్తృత్వం తన కున్నట్టు చెప్పికూడా “విద్ద్య కర్తార మవ్యయ" మ్మని మరలా దాన్ని త్రోసి పుచ్చాడాయన అంతేగాదు. “న కర్తృత్వమ్ న కర్మాణి-లోకస్య సృజతి ప్రభుః” అని జీవులకు కూడా కర్తృత్వం లేదని చాటుతున్నాడు. జీవేశ్వరుల కిద్దరికీ లేకపోతే శాస్త్రానికి మాత్రమెక్కడిది.

మరి ఎక్కడిదీ విభాగమని ఆశ్చర్యపడ నక్కరలేదు. స్వభావస్తు ప్రవర్తతే అని-స్వభావ ప్రభవై ర్గుణైః అని-సమభావ మిస్తూనే ఉన్నాడు భగవానుడు. మానవుల స్వభావం లోనే గర్భితమయి ఉందది. అనాది సిద్దమైన అజ్ఞానమే ఆ స్వభావం. దాని వల్లనే మన బుద్దులూ మన మాటలూ - మన చేష్టలూ - అనేక విధాలుగా తయారయినాయి. వీటి నాధారం చేసుకొనే మన సృష్టి జరిగింది. దాన్ని నిమిత్తంగా చేసుకొనే శాస్త్రం కూడా మన కాయా కర్మలు విభజించి బోధిస్తుంది.

కాబట్టి ఇది ఎవరు చేసిందీ గాదు. మనం -చేసుకొన్నదే. మన కజ్ఞాన మనేది వెంటాడు తున్నంత వరకూ ఈ గుణ భేదం తప్పదు వర్ణ భేదం కాకుంటే వర్గభేదమైనా ఉండి తీరుతుంది. ఇప్పుడీ వర్తమాన కాలంలో కూడా చూడండి, ఆచార్య వర్గమనీ priests పాలక వర్గమనీ Administrators వాణిజ్య వర్గమనీ Labourers శ్రామిక వర్గ మనీ Labourers నాలుగు వర్ణాల వారూ ప్రత్తి దేశంలో ప్రతి సమాజం లోనూ కనిపిస్తూనే ఉన్నారు గదా. శ్రామికుడు వ్యాపారమూ చేయలేడు. వ్యాపారస్థుడు దేశ పాలనా చేయలేడు. పాలకుడు మతాచార్యుడు గానూ ఉండలేదు. ఎవడి స్వభావం వాడిదే. పుట్టుకతో వచ్చిందది. పుటం పెట్టినా మారదు.

అయితే అజ్ఞాన మున్నంత వరకూ అనేమాట మనం గుర్తుంచుకోవాలి. అంతా ఒకే ఒక ఆత్మ చైతన్య మనే సత్యాన్ని గుర్తించక పోవటమే గదా జ్ఞానం తన్మూలంగా ఏర్పడిందే ఈ విభాగం. కాబట్టి ఇది వ్యావహారికమే Relative గాని పార మార్ధికం Absolute గాదు. పార మార్దిక దృష్టితో చూస్తే అంతా సమానమే. పండితాస్సమ దర్శనః అయితే ఆ సమ దర్శన మలవడాలి ఇంతకూ. అది ఆత్మ జ్ఞానంతో గాని రాదు. ఆ జ్ఞాన మింకా ఉదయించ కుండానే అంతా ఏకమని చాటుతూ పోవటం ఆత్మ వంచన అవుతుంది. నూటికి తొంభయి. తొమ్మిది మంది ఆత్మ జ్ఞానం లేనివారే. కాబట్టి, ఈ వ్యవస్థ వ్యావహారికంగా ఇలా సాగుతూ పోవలసిందే తప్పదు.