#


Back

Page 7

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


7
దేహినోఽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ॥ 2-13 ॥

శరీరాన్ని వస్త్రంతో పోల్చి చెప్పారు. బాగానే వుంది. కాని ఎంత బాగున్నా ఆ భావం మనసు కంతగా పట్టకపోవచ్చు. కారణమేమంటే వస్త్ర మనేది మన శరీరం కన్నా వేరయిన పదార్థం. కాబట్టి అది తొలగినా మనకు బాధలేదు. పోతే ఈ శరీర మలాంటిది గాదు. ఇది పుట్టినప్పటి నుంచి మనల నంటిపెట్టు కొని ఉంది. మనతో అవినాభూతంగా కనిపిస్తున్నది. ఇలాంటి దాన్ని మన మొక వస్త్రం మాదిరి చూడటమెలా సాధ్యపడుతుందని ప్రశ్న.
నిజమే. నీవన్నట్టు అవినా భూతమైనదే అయితే అలా భావించట మసాధ్యమే కాని అవినా భూతం కాదిది. వినాభూతమే Separable. వివేచన చేయకనే గాని బాగా లోతుకు దిగి చూస్తే నిజంగా ఒక వస్త్రం మాదిరి ఇదీ మనకు బాహ్యమే. ఎంచేత నంటే మనం బాల్యంలో చూచిన శరీరం యౌవనంలో లేదు. యౌవనంలో చూచింది వార్ధక్యంలో లేదు. ఎప్పటకప్పుడు మారుతూ పోతున్నదీ శరీరం. కొన్ని ఏండ్లు గడచిన తరువాత అంతకు ముందు చూచిన దానికీ దీనికీ అసలు సాజాత్యమే కానరాదు. ప్రతి ఏడు సంవత్సరాలకూ ఒకసారి మన దేహం యావత్తూ నశించి ఇంకొకటి క్రొత్తగా దాని స్థానంలో ప్రవేశిస్తుందని చెబుతారు శాస్త్రజ్ఞులు అలాంటప్పుడీ శరీరం మాత్రం మన కవినా భూతమెలా అయింది. ఎప్పటికప్పుడొక కప్పుడు బొంతలాగా తగులుతూ వదులుతూ ఉండటం దాఖలా అవుతూ ఉంది గదా.

జీవిత మంతా మనకున్న ఈ అనుభవాన్ని బట్టి రేపు అవసానంలో ఈ శరీర మంతా ఒక్కసారిగా తొలగిపోయి మరి ఒక సరిక్రొత్త శరీరం వస్తుందనే మాట మన మెందుకని నమ్మరాదు. దృష్టాన్ని బట్టే గదా అదృష్టాన్ని ఊహిస్తాడు మానవుడు. దృష్టం మనకు జీవితం. ఇందులో మన ముంటూనే మన శరీరం పోతూ వస్తున్నది. దీన్ని బట్టి మరణం కూడా ఇంతేనని గ్రహించవచ్చు. మరణంలో కూడా భౌతికమైన శరీరానికే గాని మార్పు-అభౌతికమైన చైతన్యానికి లేదు. బాల్యంపోయి యౌవనం వచ్చినప్పుడూ యౌవనంపోయి వార్ధక్యం వచ్చినప్పుడూ మనకది అనుభవసిద్ధమే గదా. బాల్యంలో చూచిన శరీరమే మారింది గాని దానిని కనిపెట్టిన నేననే స్ఫూర్తిమారలేదు. రేపు మరణం లోనూ అంతే గదా. అప్పుడు శరీరమే మారుతుంది గాని లోపలి స్పూర్తి మారబోదు. మారకుంటే ఇక మనకు మరణమెక్కడిది.

అయితే వచ్చిన ఇబ్బంది ఏమంటే మరణంలో ఈ శరీరం కదలకుండా పడిపోతుంది. వెంటనే దాన్ని బంధువులు దహనంచేసి మరలా మనకు కనపడ కుండా చేస్తున్నారు. అందువల్ల మనకనుమానం - మరొక శరీరం ధరిస్తామా లేదా అని. ఈ అనుమానం ప్రక్కన నిలబడి చూచే వాళ్ళకే. వాడికి కాదు. వాడి అనుభవమేమిటో బ్రతికిన వాళ్ళెవరికి అంతువట్టదు. అప్పట్లో వాడికి కలిగే అనుభవాలు రెండే. శరీరమే నేనని 'భ్రమపడ్డాడా దానితోపాటు తానూ పోవలసి వస్తుంది. అలాకాక వేరు చేసుకొని చూడగలిగాడా అది నశిస్తున్నా తాను నశించటం లేదనే ధైర్యంతో నిలిచి ఉంటాడు.
మరి అలా నిలవాలంటే సామాన్యమైన విషయం కాదు. ధీరుడయి వుండాలి వాడు. ధీ అంటే బుద్ధి, వివేచనా శక్తి అని అర్ధం అది ఉన్నవాడే ధీరుడు. అలాంటి వాడు తప్పకుండా దేహం కంటే ఆత్మను వేరుగా చూడ గలుగుతాడు. చూడ గలిగితే ఇక మోహ వాగురలో పడే ప్రసక్తిలేదు. శరీరాదులే నేనని అభిమానించటమే Identification మోహం. ఈ మోహమే అవిద్య Ignorance of the fact. ఇదే మన మరణానికి కారణమవుతున్నది. అది లేకుంటే మరణమే లేదు మనకు. అమృత స్వరూపులమే.