#


Back

Page 65

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


65
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభం ।
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥ 2-57 ॥

కానీ ప్రతివాడూ డప్పాలు కొడుతుంటాడు-నేను నిష్కామ కర్మ చేస్తున్నాను- నాకు దేనిమీదా ఆసక్తి లేదని, పైకి చెప్పటం వేరు, యధార్థ్ధంగా ఉండటం వేరు. మానలవుందరికీ ఒక నైజం ఉన్నది. యథార్థాన్ని మరుగుపరచి అయథార్ధాన్నే లోకానికి ప్రదర్శించటం. ఇలాంటి ప్రదర్శనవల్ల అణుమాత్రంకూడా మనకు ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకపోగా పెద్దమోసమిది. ఎక్కడయినా చెల్లుతుందేమో గాని ఆధ్యాత్మిక రంగంలో మోసమనేది ఏ మాత్రము చెల్లదు. మాటలలో ఎన్ని చెప్పినా చేతలలో తప్పకుండా బయటపడతాడు.

ఇంతెందుకు. నీవు నిష్కాముడ వైనందుకు ఒక్కటే గుర్తు. జీవిత మనేది ఒకే విధంగా గడవదెవ్వరికీ, కష్టాలువస్తుంటాయి. సుఖాలు వస్తుంటాయి అవీ ఎన్నో విధాలుగా ఎన్నో మోతాదులలో సంప్రాప్తిస్తుంటాయి. గుక్క తిప్పుకోవటానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడతాయి. గుండె పగిలి పోయే సంఘటనలే సంభవిస్తాయి. అలాగే ఆత్యుత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బులయ్యే ఆనందం కూడా కలుగుతుంది. ఇలాంటి సందర్భాలలోసాధకుడే మాత్రమూ క్రుంగిపోరాదు. పొంగిపోరాదు. వచ్చింది వచ్చినట్టుగా స్వీకరించాలి. అదే భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించాలి.

ఇది వాడి మనస్సులోనూ మాటలోనూ అయితే లాభంలేదు. మనసూ మాటా అనేది మనం చొచ్చి చూడలేము. ప్రవర్తనలో కనిపించాలి ప్రతి ఒక్కటీ, ప్రవర్తన నెవ్వడూ కప్పివుచ్చలేడు. మరిదేనిలో బయట పడకపోయినా దానిలో తప్పకుండా బయటపడుతుంది. ఏదీ అలా ఎందరున్నారు సత్పవర్తన కలవారు, స్వాముల వార్ల దగ్గర నుంచీ సామాన్యుల దాకా అందరూ దొంగలే. ఆత్మ వంచకులే. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఎగిరి గంతులు వేస్తారు. ఏ మాత్రం దానికి భిన్నంగా జరిగినా క్రుంగి కృశించి పోతారు.

ఇలాంటి పాటు పోటులు లేకుండా తాపీగా ఉండాలంటే జీవితం-అభిస్నేహ ముండరాదు దేనిలోనూ. అభిస్నేహ మంటే అభిమాన బుద్ధి ఇది నా సర్వస్వమనే తాదాత్మభావం. అదే అనుకూల ప్రతికూలాలనే వైష్యమ్యానికి పునాది. మనస్సులొనే పెకలించ గలగాలి ఆ పునాదులను మనం. పెకలిస్తే ఇక మాటా చేతావాటి పాటికవే నిర్మలమవుతాయి. నిర్మలమూ నిబ్బరమూ అయిన ప్రవర్తన ఉన్న సాధకుడికి ఏది ఎలా జరిగినా ఒక్కటే. మంచి జరిగితే అభినందించడు. చెడ్డ జరిగితే నిందించడు. రెంటికీ అతీతంగా కనబడతాడు.