#


Back

Page 58

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


58
సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం ।
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ॥ 13-28 ॥

అలాగే నాలో మాత్రమే ఉండి మరెక్కడా లేకపోయినా సుఖంలేదు మరలా. నేనేగాక నేనుచూచే దంతాకూడా అదేనని గదా పేర్కొన్నాము. అలాంటప్పుడది నాలోపల ఎలా ఉందో వెలపలకూడ అలాగే వ్యాపించి ఉండాలి. లేకపోతే అంతా అదేననే మాట కర్థంలేదు.

కాబట్టి మొదట తనలో ఉన్నట్టు అర్ధంచేసుకొన్న తరువాత అదే ఈ ప్రపంచ మంతా సమానంగా పరచుకొని ఉన్నట్టు చూస్తుండాలి. ఎక్కడా ఎక్కువగా లేదు. తక్కువగా లేదు. నిరాకారమైన పదార్థంలో హెచ్చుతగ్గులు రావెప్పుడూ. ఆకాశ మిప్పుడంతటా వ్యాపించి ఉంది. దానిలో హెచ్చుతగ్గులేమున్నాయని. అలాగే ఈ చైతన్యంకూడా సమంగానే ఉంది సర్వత్రా. అలాగే సమదృష్టితో చూడాలి దాన్ని.

చూస్తే ఏమవుతుంది. ఆత్మకు ఆత్మ బాధకం కాకుండా పోతుంది. చైతన్య మనేది ఆత్మ. అది విషయం కాదు మనకు. విషయి. అంటే మన స్వరూపమే. స్మరూపమంటే ఆత్మఅనే ఆర్థం. ఆత్మ ఎక్కడ ఉంది. మనలోపలా ఉంది వెలపలా ఉంది. అంటే లోపలా నేనేవెలుపలా నేనే అనే విస్తృతమైన భావనతో చూడాలి మనం. అప్పుడే అది విశ్వాత్మ లేక పరమాత్మగా మన అనుభవానికి వస్తుంది. అలాకాక అదినా లోపలే చూచి వెలపల చూడలేక పోయాననుకోండి. అప్పుడా వెలపలిది అనాత్మగా మారి దీన్ని బాధిస్తుంది. బాధించటమేమిటని అడగవచ్చు. శరీరం లోపలే ఉందనుకొన్నాము కాబట్టి శరీరం పోయేసరికి అదికూడా ఎక్కడికో పోతుందని భ్రాంతిపడతాము. అదే చావు.

ఇలా మన చావుకు దారితీస్తుంది కనుకనే అది దీనికి బాధకమని చెప్పటం. ఎప్పుడయితే వెలపలకూడా నేనే ఉన్నాను-నాకంటే భిన్నంగా ఎక్కడా ఏదీ లేదని విస్వసించానో -అప్పుడంతా ఆత్మేఅవుతుంది. కాబట్టి ఏదీ నాకు బాధకం కాదు. ఆత్మను ఆత్మ ఎలా బాధిస్తుంది. సంకుచితంగా చూస్తే మాత్రం బాధిస్తుంది. ఎందుకంటే సంకుచితమనే సరికి కొంత మాత్రమే ఆత్మగా నిలిచి మిగతాదంతా అనాత్మగా మారుతుంది. అప్పుడది బాధకం. విశాలంగా చూచామంటే అనాత్మగా మారటానికి వీలు లేదు. కాబట్టి అప్పుడిక బాధకమనే ప్రసక్తేలేదు. లేకపోతే మరణమే లేదు మానవుడికి.

మరణం లేకపోతే పోవచ్చు. కాని వాడే మవుతాడనే ప్రశ్న రావచ్చు మరలా. వాడేమీ కాడు. వాడంటే కేవల చైతన్య స్వరూపుడే కాబట్టి మొదటినుంచీ ఎలా ఉన్నాడో అలాగే అప్పుడూ ఉండిపోతాడు ఎలా ఉన్నాడు మొదటినుంచీ. సర్వ వ్యాపకమై పరిశుద్ధమై కూటస్థమైన చైతన్యంగా గదా ఉన్నాడని వర్ణించాము. ఆ తత్త్వాని కెప్పుడూ మార్పనేది లేదు. మార్పు లేకుంటే మరణం లేదు. దానినే పరమ పద మన్నారు. ఇదుగో ఆ పదంలోనే కదలకుండా శాశ్వతంగా ఉండి పోతాడు సాధకుడు.

ఇతి
సాథక గీతాయామ్ పూర్వార్థమ్‌
సమాప్తమ్

***