#


Back

Page 56

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


56
సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షిశిరోముఖం ।
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ॥ 13-14 ॥

ఇంతకూ ఎప్పుడూ ఉన్నదొక పరిపూర్ణ చైతన్యమే. అదే నామరూపాత్మకమైన ప్రపంచంగా తన మాయాశక్తి చేత ఇలా భాసిస్తూ ఉంది. అంచేత మన ఇంద్రియాలూ ఇంద్రియ గుణాలూ వాటి కాశ్రయమైన ఈ శరీరాలూ -వీటికి బాహ్యంగా గోచరించే శబ్ధస్పర్శాదులైన విషయాలూ వాటి కధిష్థానమైన ఈ ప్రపంచమూ-అంతా దాని ఆభాసే. అంటే అదే ఈ రూపంలో కనిపిస్తూ ఉంది గాని ఇది వేరే ఒక పదార్దంగా ఎక్కడా లేదు.

వేరుగా లేదు గనుకనే దానికి ఈ కరచరణాదులేవో ఉన్నాయని భావించడం కూడా పొరబాటే. వాస్తవంలో దానికి ఇంద్రియాలూ లేవు. ఇంద్రియ గోచరమైన ప్రవంచమూ లేదు. ఇవి ఏవీ లేకపోతే దానికిక దేనితో మాత్రం సంగ మేముంది. దానినిది భరించటమేముంది. రెండవ పదార్థమంటూ ఒకటి ఉంటే గదా. ఆ ఉన్నదని మనం చూచేది కూడా అదే ఆయె. అంచేత అది వాస్తవానికి నిర్గుణం. ఏ గుణాలూ లేవుదానికి. ఐతే చమత్కారమేమంటే ఉన్నట్టుగా కనిపిస్తాయవి. అది దాని యోగమాయా విలాసమే గాని మరేదీ కాదు.