Page 52
సాధక గీత
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
(పూర్వార్థమ్)
ఈ వర్ణించిన పద్ధతిని చూస్తే చాలా రమణీయంగానే ఉన్నది గాని ఇలాంటి గొప్ప అదృష్టం మానవులకు పడుతుందా అని మరలా అనుమానం. ఎందు కంటే ఏది సాధించినా చివరకు మనసుతోనే కదా సాధించాలి. ఆ మనసనేది ఎలాంటిదో మనకు తెలుసు. అంత చంచలమైన పదార్థమే లేదు సృష్టిలో. అది అచలమైన స్థితికి వస్తేనే తప్ప మనకా పరతత్త్వాన్ని అందుకొనే ఆశలేదు. అలాంటప్పుడిక దాన్ని ఎంతవర్ణించి ఏమి ప్రయోజనం. దాన్ని సాధించే మనసు మనకు వశమయ్యేది లేదు కదా.
వాస్తవమే అలాగని ఉపేక్ష వహించరాదు. వహిస్తే యావజ్జీవమూ అలాగే ఉండిపోతాడు మానవుడు. ఏ ఒక్కటీ సాధించలేడు. సాధకుడెప్పుడూ అభ్యసం సాగిస్తూనే ఉండాలి. తప్పదు. అభ్యాసం సాగించే కొద్దీ బుద్ది పదునెక్కుతుంది. నిర్మల మౌతుంది. క్రమంగా స్వరూపభావనతో నిండిపోయి అన్యభావాలను గూర్చి ఆలోచించటం మానివేస్తుంది. అది మానేకొద్దీ బ్రహ్మభావనే దృఢమౌతూ వస్తుంది.
అలా అయితే చివరకు ప్రయాణకాలం దగ్గర పడే క్షణంలో కూడా అలవాటు కొద్దీ అదే బ్రహ్మ భావనలో నిలవ గలుగుతాడు మానవుడు. ప్రాణం పోయే సమయంలో కూడా నేనే బ్రహ్మాన్ని అనే అఖండ వృత్తిని ఏ మాత్రమూ విస్మరించడు. విస్మరణమే మరణం. కనుక నిరంతర స్మరణ మేమరని సాధకుడు తప్పకుండా సాయుజ్య మందుకోగలడు.