#


Back

Page 44

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


44
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత ।
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ॥ 7-27 ॥

ఆవరణ మీశ్వరుడి దంటూనే మరలా ఈశ్వరుడి కాదోషమెంత మాత్రమూ సోక దంటున్నారు. జీవుడిది కాదంటూనే దోషమంతా అతని మెడకే చుడుతున్నారు. రెండూ చైతన్యాలే అయినప్పుడది రెండింటికి దుర్భిణి మాదిరి పని చేయాలి గాని ఒక దాన్ని తప్పించటమేమిటి. మరొకదాన్ని బాధించట మేమిటని ఆక్షేపించవచ్చు.

దీనికి శాస్త్రం చెప్పే సమాధాన మిది. మన మీశ్వర స్వరూపులమే. మన చైతన్యం సర్వవ్యాపక మైనది. ఎలాంటి అవరోధం దానికి లేదని మనం భావించ గలిగితే చాలు. నిజంగా మన మీశ్వరుడే అవుతాము అప్పుడెలాంటి ఆవరణ దోషమూ లేదు మనకు. అయితే అలా భావించే అదృష్టానికి మనం నోచు కోవడం లేదు. కనుకనే తద్భిన్నంగా జీవులమై కూచున్నాము. అయినందుకు మనకేమిటి దాఖలా. మనలో ప్రతి ఒక్కడూ నాకు పరిపూర్ణమైన జ్ఞానముందని అనుభవానికి తెచ్చుకోలేక పోవడమే. అనుభవమేకదా దేనికైనా ప్రమాణం. అనుభవాన్ని ఎలా కాదనగలం. అజ్ఞానులమనే అనుభవం మనలో సహజంగానే చోటు చేసుకొని ఉంది.

దీనిని బట్టి అసలు మానవుడు జన్మ ఎత్తినప్పుడే అజ్ఞానంతో జన్మించాడని అర్థమవుతున్నది. దీనికే మోహమని కూడా పేరు. ఈ మోహమొక అంధకారం లాంటిది. అది పుట్టుకతోనే మన అఖండ దృష్టిని ఆచ్చాదిస్తున్నది. అంతటితో ఊరుకోక ఇచ్చాద్వేషాలనే భావాలను రెచ్చగొట్టి నిర్వి కల్పమైన తత్త్వాన్ని సవికల్పంగా చూడటాని కలవాటు చేసింది. తన్మూలంగా నేను నాది అనే ద్వంద్వాల అనుభవం సంప్రాప్తమైంది. దాని వల్లనే ఈ ప్రపంచమంతా మన దృష్టికి బ్రహ్మమయంగా భాసించటానికి మారుగా బ్రహ్మమే ప్రపంచాకారంగా భాసించసాగింది.

ఇదీ జరిగిన పెద్దమోసం. ఈ మోసానికేమిటి కారణం. మన అజ్ఞానం. ఎప్పటిదీ అజ్ఞానం. అనాది సిద్ధం. అది మనకెందుకేర్పడింది. మనం చేసుకున్న కర్మేదానికి కరణం: కారణం లేని కార్యమెప్పుడూ సంభవించదు. మన మీ జన్మలో అజ్ఞానంతో జన్మించామంటే మన మంతకుముందు చేసుకొన్నదే. మనం చేసుకొన్నది కాకుంటే అది మనలనెందుకు బాధించాలి. కర్మే అజ్ఞానాన్ని ప్రేరేపిస్తే ఆ అజ్ఞానం మనకు ద్వంద్వానుభవాన్ని ప్రసాదిస్తే అది మరలా మనచేత కర్మ చేయించి అజ్ఞానకూపంలో పడదోస్తున్నది.