#


Back

Page 41

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


41
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః ।
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం ॥ 7-24 ॥

అసలు పరతత్త్వ మనేది ఒకటి ఉండగా దానిని త్రోసి పుచ్చి ఆయా క్షుద్ర దేవతల నుపాసించే అగత్య మేమి వచ్చిందని ప్రశ్న అందుకు కారణం ఒక్కటే. పరతత్త్వ మెప్పుడూ మనకు వ్యక్తం కాదు. నామ రూప క్రియా శూన్య మది. అలాంటి దెప్పుడూ ఇంద్రియాలకు ప్రత్యక్ష మయ్యేది కాదు. అంతరింద్రియమైన మనస్సు చేతనే గ్రహించవలసి వుంటుంది, అదీ సంస్కృతమైన Refined మనస్సయితేనే.

అలాంటి సంస్కార వంతమైన బుద్ది లేని వారంతా ఇక ప్రాకృతులే Uncultured వారు. దానిని కూడా ప్రాకృతమైన బుద్ది తోనే పట్టుకోవాలని చూస్తారు. అది వ్యక్తం కాకపోయినా వ్యక్తమైన స్థాయికి దించటానికే ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్న ఫలితమే ఇన్ని దేవతా మూర్తులూ ఇన్ని ఉపాసనలూ లోకంలో. తత్త్వానికి నామరూపాలు లేవు. ఈ దేవతలకో నామ రూపాదులున్నాయి. కాబట్టి మనసు వాటి మీద నిలపటం సులభమని ఉపాసకుని అభిప్రాయం.

అయితే ఇది వాడి సౌకర్యం కోసం చేసుకొన్న కల్పనే కాని వాస్తవం కాదు. కారణ మేమంటే అది అవ్యయం పరిణమించే స్వభావం దానికి లేదు అనుత్తమ మని దానికీ పేరు ఉత్తమం కానిదేదో అదీ అనుత్తమం. అంతకన్నా గొప్ప పదార్ధమేదీ లేదు. అది అన్నింటికీ మూల కారణమని గదా ప్రతిపాదించాము. అలాంటప్పుడిక దానిని మించిన తత్త్వమెలా ఉండగలదు. కనుకనే దానిని కూటస్ధ Constant మన్నారు. అది ఎలా ఉంటే అలా భావించటమే మన విధి. అంతేగాని ఒక విధంగా ఉంటే మరొక విధంగా చూడటం గాదు. చూస్తే తత్త్వానికి దూరమైపోతాయే గాని దాని కెన్నటికీ సన్నిహితులం కాము. కాలేము. ఇంతకన్నా తెలివి తక్కువ ఏముంది.