Page 38
సాధక గీత
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
(పూర్వార్థమ్)
అఖండ మైన తత్త్వాన్ని ఖండంగా భావించే వాని దృష్టి సమగ్రం కానేరదు. పైగా అది సకామం. అయినా వాడు భావించిన ఆ మూర్తినే భక్తి శ్రద్దలతో ఆరాధిస్తాడు. శ్రద్ధ అనేది చాల శ్లాఘ నీయమైన గుణమని గదా ముందు చెప్పాము. కాబట్టి ఆ శ్రద్ధ సడలకుండా వాడి కంత కంత కచంచలంగా పరిణమించేలా చేస్తాడా పరమాత్మ. ఎంచేత నంటే తన అఖండ స్వరూపాన్ని వాడు గుర్తించ లేదనే గాని ఏదో ఒక రూపంలో తన్ను సేవిస్తూనే ఉన్నాడు. అకామంగా తన్ను భావించలేదనే గాని ఏదో ఒక కామంతోనైనా తన్ను ఆశ్రయిస్తున్నాడు. అదే చాలు భగవానుడు వాడి ననుగ్రహించదానికి.