#


Back

Page 36

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


36
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥ 7-19 ॥

అయితే ఈ మహోన్నతమయిన స్థాయిని అందు కోవాలంటే సామాన్యం కాదు. ఎన్నో కోట్ల జన్మలు గడిస్తే గాని అలాంటి పరిపాకంరాదు. కారణ మేమంటే జ్ఞాన మనేది ఆఖరి మెట్టు. ఆ తరువాత ఇక ఏదీలేదు. అంచేత ఎన్ని జన్మలెత్తినా అంతకు ముందే మన మెత్తవలసింది. జ్ఞానోదయమయ్యే వరకూ జన్మలనేవి తప్పవు గదా. అందులో కొన్ని లక్షలు కేవలం కర్మాచరణతోనే గడచి పోతాయి. కొన్ని జన్మలు సమాధి యోగ సాధనలో గడుస్తాయి. మరికొన్ని తత్త్వదేవతోపాసనతో. ఇంకా కొన్ని సగుణోపాసనతో సరిపోతాయి. ఇలా క్రమంగా ఎక్కుతూపోతే గాని కడపట వీటన్నిటి ఫలితంగా జ్ఞాన మనే దానికి నోచుకోడు సాధకుడు. కనుకనే “జన్మనామంతే” అని ప్రయోగించటం. జ్ఞాన ముదయించిందంటే ఇక జన్మ పరం పర అక్కడికి పరి సమాప్తం కావటమే మనకు తార్కాణం. అంత వరకూ జన్మలు తప్పవు. అవికూడా ఎప్పటికైనా ఈ జ్ఞాన ఫలాన్ని సాధించటం కోసమే తప్ప మరి ఒక ప్రయోజనం లేదు వాటికి. దీనిని బట్టే చెప్పవచ్చు. జ్ఞానం మిగతా కర్మానుష్టానాదుల కంటే ఎంత గొప్పదో. అక్కడికి జన్మే కడతేరుతున్నదంటే అన్నిటికన్నా అది శ్రేష్టమని వాచా చెప్పవలెనా. అయితే జ్ఞానం జ్ఞాన మంటున్నారు. ఏమిటా జ్ఞానం. ప్రాపంచిక జ్ఞానమా కాదు. శాస్త్రజ్ఞానమా కాదు. వేదాంత జ్ఞానమా అదీ కాదు. మరేమిటి. ఈ చెప్పినవి కాక ఇంకా ఈ సృష్టిలో ఎంతెంత ఉన్నదో అదంతా ఒకే ఒక తత్త్వమని అనుభవానికి తెచ్చు కోవటమే యధార్థమైన జ్ఞానం. “వాసుదేవ స్సర్వమితి” అనే వాక్యానికి ఇదే అర్ధం. సర్వభూత నివాసోసి వాసు దేవ నమోస్తుతే. చరాచర ప్రపంచాన్నంతటినీ వ్యాపించి ఉన్నతత్త్వమేదో అదే వాసుదేవుడు. వసతి-దీవ్యతి అంటే అస్తి భాతి-లేదా సచ్చిత్తులనే అక్షరార్థం. సచ్చిదాత్మకమే కదా పరతత్త్వం అలాంటి సర్వ వ్యాపకమైన తత్త్వమే ఈ కనిపించే ప్రపంచమంతా. దానికి విలక్షణంగా అందులో అణు మాత్రం కూడా లేదని నిత్యమూ చూడగలిగితే దానికి ప్రపత్తి అని పేరు. అప్పటికి ప్రపత్తి అంటే “అడియేన్‌ దాసన్‌” అని కాళ్ళమీద పడటం కాదన్న మాట. అది కేవలం బాహిరమైన చర్య. పోతే ఇది మానసికం.

అయితే ఇలాంటి సర్వాత్మ భావన పట్టుపడిన వాడు కోటికొకడు ఉంటాడో లేదో. ఉంటే వాడు మహాత్ముడే. మహత్తంటే గొప్పదని అర్థం. అన్నిటి కన్నా గొప్పది. ఈ సృష్టిలో ఆత్మ ఒక్కటే. అలాంటి ఆత్మనే పట్టుకొన్న వాడు గనుక అతడే మహాత్ముడు. మిగతా వారందరికీ ఆత్మలేదా అని అడగవచ్చు. ఉంది గాని దానిని వారు ఎలా ఉందో అలా పట్టుకోలేక పోతున్నారు. వారు పట్టుకొన్న ఆత్మ భూతాత్మ-దేహాత్మ-విజ్ఞానాత్మ మాత్రమే. ప్రత్యగాత్మ గాదు. అందుచేత మహాత్మ అనే స్థాయికి వారు రాలేదు.

దీనిని బట్టి జ్ఞాన మొక్కటే సంసార తారకమనీ అది కూడ పరోక్షం కాదు-అపరోక్షంగా అనుభవానికి వచ్చేదని స్పష్ట మయింది. అలా అపరోక్షంగా అనుభవానికి రావాలంటే అది ఎన్నో జన్మల నోము ఫలమని కూడా అవగత మయింది ఇలాంటి పరాకాష్ట Summit నందుకొన్న వాడెవడు. వాడెక్కడ ఉంటాడు సుదుర్లభః దుర్లభ అంటేనే చాలు చాలా అరుదని చెప్పటానికి. సుదుర్లభః అట. అంటే అరుదుగానైనా అసలు కనిపిస్తాడో లేదో చెప్పలేము. ఇది ఆత్మ జ్ఞానమనేది ఎంత అపురూపమైనదో దాని మహత్త్వాన్ని వర్ణించటానికి చెప్పిన మాటే గాని అలాంటివాడసలెక్కడా ఉండడని కాదు. అంతే కాదు. అంత అపురూపమైంది గనుకనే వజ్రవైడూర్యాదుల లాగా దాన్ని పట్టుకోటానికి మానవు డితోధికంగా కృషి చేయాలని కూడా ఒక ప్రబోధమే ఇది.