#


Back

Page 35

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


35
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ।
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం ॥ 7-18 ॥

ఆర్తాదు లందరూ ఉదారులు కారా అంటే ఉదారులే. సందేహం లేదు. మరీ పశుప్రాయంగా బ్రతికే అనేక లక్షలమంది కంటే ఎప్పుడో ఒకప్పుడు కష్టంలోనైనా పరమార్ధాన్ని స్మరించే వాడు గొప్పవాడే. కష్టం ప్రాప్తించినప్పుడే కాక కోరికల నెపంతోనైనా తరుచుగా స్మరించేవాడు అంతకన్నా గొప్ప. పోతే అవి రండూ కూడా తుచ్చంగా భావించి అసలు విషయ మేమిటో తెలుసుకోవాలని కాంక్షించే వాడు గొప్ప మహనీయుడు. అయితే ఎంత మహనీయుడైనా ఆ పరమార్ర్ధాని కింకా దూరంగానే ఉండిపోతున్నాడు కాని దగ్గరపడటం లేదు. అలా దగ్గరగా వచ్చి నీవే నేను- నేనే నీవని దానితో ఏకత్వాన్ని భజించే వాడు జ్ఞాని. వారు ముగ్గురూ ఆత్మీయులైతే ఇతడు కేవల మాత్మరూపుడే. కనుకనే జ్ఞాని వారందరి కన్నా విశిష్టుడు:

అయితే ఇంత ఉత్కృష్టమైన స్థానాన్ని ఎలా అందుకో గలిగాడు జ్ఞాని. అతని ఆత్మ సంయమం అలాంటిది. పరిపూర్ణమైన చైతన్యాన్ని తప్ప సృష్టిలో మరేది కానీ దర్శించ డతడు. తానూ చైతన్యమే తాను చూచే జగత్తూ చైతన్యమే. రెంటికీ అతీతమని భావించే ఈశ్వరుడూ చైతన్యమే అతని దృష్టికి. అలాంటి దృష్టికి ఇక భేద మేముంటుంది సృష్టిలో. భేదమే లేదంటే దూరం దగ్గర అనే పరామర్శ ఏముంది. తానే సర్వమూ అనే పరిపూర్ణ భావ మయత్నంగానే సిద్దిస్తుంది కాబట్టి సర్వోత్కృష్టుడైనవాడు జ్ఞాని ఒక్కడే.