#


Back

Page 32

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


32
 మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః ।
 భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే ॥ 17-16 ॥

     కానీ ఈ విచారణ మాత్రం చేయగలమా అని ప్రశ్న ఎంచేతనంటే విచారణ అనేది బుద్దికి సంబంధించిన విషయం. బుద్ధి పురాకృత కర్మఫలం. బుద్దిః కర్మాను సారిణీ. అని గదా పెద్దలు చెప్పిన మాట. కర్మ వల్ల ఏర్పడిన బుద్దికి కర్మ వ్యూహాన్ని భేదించుకొని 'పోయే శక్తి ఎక్కడిది. మరి విచారణ అలకే అలాంటి ప్రయత్నమే కదా. కాబట్టి అది కూడా ఒక గొంతెమ్మ కోరికే గాని వాస్తవంలో ఎంత మాత్రమూ సంభవం కాదని తోస్తుంది.

    తోచటం సహజమే. కానీ కర్మ అనగానే మనం బెదరి పోగూడదు. సర్వ శక్తులూ అది గుత్తకు తీసుకొన్నదని బ్రాంతి పడరాదు. కర్మలనేవి రెండు రకాలు. ఒకటి దుష్టతం. మరి ఒకటీ సుకృతం. రెండూ కలిసి మన జన్మకు నిమిత్త మవుతాయి. ఇందులో కూడా ఒక సుక్ష్మ మున్నది. మరీ మొద్దులయితే చెప్పలేముగాని కొంత ఆలోచనా పరులైన మానవుల కందరికీ రెండు బుద్దు లుంటాయి. ఒకటి ప్రాపంచిక విషయాల మీదికి పరుగెత్తేది. మరొకటి పార మార్ధికాన్ని పట్టుకొనేది. ఇందులో మొదటిదానికి మన దుష్కృతం కారణమైతే రెండవ దానికి సుకృతకర్మ కారణ మవుతుంది.
అంచేత రెండంచులా పదునైన దీకర్మ అనే కరవాలం. దుష్కృత మొక అంచయితే దానికి సుకృత మొక అంచు. ఒకదానితో అది గుణత్రయమనే విషవలయంలో పడద్రోసి అధః పాతాళాని కణగ ద్రొక్కగలదు. వేరొక దానితో ఆ వ్యూహాన్ని భేదించి పరమపద శిఖరాని కెక్కించనూగలదు. దీనినిబట్టి మన కర్థమయిందేమిటి. ఏ కర్మ బంధకమని భయ పడుతున్నామో మనం -అదే మనపాలిటికి మోచకంకూడా. లోకంలో కూడా ఒక ఆభాణకముంది. వజ్రాన్ని వజ్రంతోనే భేదించాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. అలాగే కర్మను నిర్మూలించ టానికి కర్మే సాధనం. అందులో నిర్మూలించేది సుకృతమైతే నిర్మూలించబడేది దుష్కుతం.

    కాబట్టి మనబుద్ది మనం చేసుకొన్న దుష్కృతాన్ని బట్టి మాయకులోబడి నడుస్తూన్నా - మనం చేసిన సుకృతాన్ని బట్టి మరలా దానిని భేదించి బయట పడవచ్చు. దీనికే పురుషకార మనిపేరు. పురుషుడు చేసే యత్నమే పురుష కారం. దైవమేగాని పురుష ప్రయత్నం లేదని వాదించరాదు అలాగయితే మానవుల మనస్తత్వాలలో చేష్టలలో ఇన్నిభేదాలు మనకు గోచరించరాదు. పరమ మూఢుల దగ్గరనుంచీ మహాయోగులదాకా మానవ బుద్దులలో ఇంత వైవిధ్య మెక్కడినుండి వచ్చి చేరింది. అందరినీ కర్మ ఒకే విధంగా బాధిస్తే అందరూ పశుప్రాయులుగానే బ్రతుకుతుండాలి గదా. ఏదీ అలా జరగటం లేదే. కాబట్టి దైవాని కెంత బలముందో పురుష ప్రయత్నానికీ అంతే ఉంది. అది సుకృతకర్మ వల్లనే ప్రాప్తిస్తుంది మనకు.

ఈ సుకృతమనేది ఏదోకొంత ఉంటేగాని అసలు పారమార్థికమైన చింతే కలగదు మానవుడికి. మనకీ పారమార్ధిక చింత ఉన్న మానవులు నాలుగు భూమి కలలో కనిపిస్తారు. మొదటివారు ఆర్తులు. వీరిది చాలా ప్రాధమికమైన దశ. ఏదో ఆపదవచ్చి నెత్తిన పడితే గాని వీరు కన్ను తెరచి చూడరు. అది గడచిందంటే మళ్ళీ యథాప్రకారమే. రెండవవారు అర్భార్థులు. ఏవో కోరికలు పెట్టుకొని అవి నెరవేరటాని కాశ్రయిస్తారు దేవుణ్ణి. దైవికంగా అవి నెరవేరా యంటే వారూ యథాప్రకారమే.

    పోతే మూడవ వారున్నారు. వీరికి జిజ్ఞాసువులని పేరు. వీరి కార్తిలేదు. కోరికలు లేవు. వీరి కున్న ఆర్తీ కోరికా ఒక్కటే. భగవత్తత్త్వ మేమిటో అర్ధం చేసుకోవాలని. ఇదికొంత మేలుజాతి. కాగా ఇంతకన్నా మేలురకం నాల్గవది వారే జ్ఞానులు. తత్త్వాన్ని గ్రహించి తదేక నిష్టతో జీవితాన్ని గడిపే మహనీయులు వీరు. శుక శౌనకాదులందరూ ఇలాంటివారే. నలుగురిలో మొదటి ఇద్దరూ ముముక్షువులు. మూడవవారు సాధకులు. నాల్గవవారు సిద్దపురుషులూనని మన మర్ధం చేసుకోవలసి ఉంటుంది.