#


Back

Page 3

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


3
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః ।
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ॥ 2-18 ॥

ఇందులో మనం గ్రహించవలసిన రహస్య మేమంటే-యధ్భావస్తద్భవతి. దేనితో తాదాత్మ్యం చెందితే అదే అవుతాడు మానవుడు. అలా అయినప్పుడు దాని గుణాలే సంక్రమిస్తాయి మనకు. ప్రస్తుతం మనమంతా ఆబాల గోపాలమూ ఈ దేహంతో తాదాత్మ్యం చెంది కూచున్నాము. ఎన్నో జన్మలనుంచి పెట్టుకొన్న ఈ సంబంధంవల్ల దీని లక్షణాలే మనకు సంక్రమించాయి. దీని - లక్షణాలేమిటి, ఒక్క మాటలో చెబితే ఎప్పటి కప్పుడంతమై పోవటం. శరీర మనేది నిత్యమయిన పదార్ధంగాదు. నిత్యమయితే అంతరించరాదు. ఇది కొన్నాళ్ళయితే కనపడకుండా నశించిపోతున్నది. మన వ్యష్టి శరీరమూ నశిస్తున్నది. సమష్టి రూపమైన ఈ విశ్వ శరీరమూ నశిస్తున్నది. ఎప్పుడో ఒకప్పుడనిగాదు. ఎవ్పుడూ నశిస్తూనే ఉంది. మార్పు చెందటమే నశించటమంటే. మార్పంటే ఏమిటి. ముందున్న దశపోయి మరొక దశ రావటమే గదా. ఇలా ప్రతిక్షణమూ దశలు మారుతూపోతే అది వినాశమే గదా శరీరానికి.

ఇలా ప్రతిక్షణమూ వినాశం పాలవుతూ ఎప్పుడో ఒక క్షణంలో పూర్తిగా నశించిపోతున్నదీ శరీరం. ఇలాంటి పదార్దాన్ని నెత్తిన వేసుకొని అదే నేను-నేనే అది-అని తాదాత్మ్యం చెందాము మనం. దీనితో అది మారుతుంటే మనం మారుతున్నామని-అది చివరకు నశిస్తుంటే మనమే సర్వనాశనమైపోతున్నామని భావిస్తున్నాము. అలా భావిస్తే శరీర ధర్మం మన కాపాదితమై మనం నిజంగానే మరణించవలసి వస్తున్నది. ఉన్నంతకాలమూ విషాదాన్ని కూడా అనుభవించ వలసే వస్తున్నది.

ఇది అసలైన అనుభవం కాదు. అనుభవా భాస శరీరంతో కాక శరీరితో తాదాత్యం చెందినప్పుడే అది నిజమైన అనుభవం. అసలు శరీరే మనం. శరీరంలో ఉన్న వాడెవడో వాడు శరీరి. వాడీ శరీరం లోపలా వెలపలా కూడా వ్యాపించి ఉన్నాడు. ఎందుకంటే పిండశరీరమేకాక బ్రహ్మాండం కూడా శరీర మేనని చెప్పాము, రెండింటినీ కనిపెట్టి చూస్తున్నది ఆత్మచైతన్యం. ఈ చైతన్యమే మన స్వరూపం. నేనే అని భావించేది మనలో ఈ చైతన్యమే. నేను చూస్తున్నాను _ చేస్తున్నాను అనుకొనేది చైతన్యమే గదా. ఈ శరీరాన్ని నాది అనుకొని దర్శించేదికూడా నా చైతన్యమే, కాబట్టి ఈ చైతన్యమే ఆత్మ. అదే అసలు నేను. అనవసరంగా అది చూచే ఈ శరీరాది సంఘాతాన్ని నేనని అభిమానిస్తున్నాను. ఇది నకిలీ నేను గాని అసలు నేనుగాదు. అసలు నేను ఈ శుద్ధ చైతన్యమే. ఇదే శరీరి అంటే.

ఇది మాత్రం శరీరంలాగా అనిత్యం కాదు. నిత్యం. అంటే ఎప్పటికీ మారేది గాదు. అవినాశి. అవినాశి అని ఎలా చెప్పగలవని అడగవచ్చు. డాని కొక్కటే జవాబు. అప్రమేయ మీ ఆత్మ. ప్రమేయం కాని దేదో అది అప్రమేయం. ప్రమేయ మంటే జ్ఞానానికి గోచరించేది. జ్ఞానానికి గోచరించేది కాదిది. జ్ఞానమే. - చైతన్యమంటె జ్ఞానమే గదా. జ్ఞానం గోచరింప జేసుకొనేదే గాని గోచరించేది కాదు. గోచరించేవి శరీరాదులైన ఉపాధులు. ఉపాధులనేవి సముద్రంలో తరం గాలు. ఒకటిపోతే ఒకటి పొడచూపుతుంటాయి. వీటి రాకపోకలను ఎప్పుడూ కనిపెట్టి చూచే చైతన్యం వాటి మాదిరి పోవటానికి లేదు. రావటానికి లేదు. స్థాయిగా నిలిచి ఉండాలి. కనుకనే అవి అనిత్యమైతే ఇది నిత్యమయి తీరాలి. నిత్యం కాకపోవటాని కిది ప్రమేయం కాదు. నామ రూపాత్మకం కాదు. ప్రమేయ మయిం దెప్పుడూ నామరూపాత్మకం. నామరూపాత్మకమైతే మార్పు చెందటం తథ్యం. మార్చు చెందిందో నశించక తప్పదు కనుకనే శరీరాదులు నశ్వరాలైతే శరీరి అయిన చైతన్య మవినాశి.

అంతేకాదు. ఆ మాటకు వస్తే నశ్వరమైన ఈ శరీరాదులు కూడా నిజంలో అవినాశి అయిన ఆ చైతన్య రూపాలే. కాబట్టి దానికి బాహ్యంగా స్వతంత్రమైన సత్తా వీటి కెప్పుడూ లేదు. సువర్ణానికి భిన్నంగా కటకకుండల కేయూరా ద్యాభరణా లెక్కడున్నాయి. సువర్ణమే ఆభరణ రూపాలుగా భాసిస్తున్న దాయె. ఆభరణాలుగా అవి అనిత్యమయినా సువర్ణంగా మరలా సత్యమే. ఎందుకంటే ఆభరణాలు మొదట లేవు. చివర లేవు. మధ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి. కనిపించే టపుడు కూడా సువర్ణ మయమే అవి. కరిగించినా చెరిపించినా ఆభరణాలన్నీ సువర్ణాత్మకమే తదాత్మకంగా అంతా ఏకమే నిత్యమే.

అలాగే ఆత్మ చైతన్యానికి వేరని చూస్తే ఈ శరీర మనః ప్రాణాదులన్నీ అనిత్యమే సందేహం లేదు. కాని వివేచన చేసి చూస్తే ఈ ఉపాధులన్నీ చైతన్య వివర్తమే గాని వేరుగావు. ఆదిలో కావు. అంతంలో కావు. నడుమ ఈ స్థితి కాలంలో ఇవి ఇలా కనిపిస్తున్నప్పుడు కూడా శరీరాదులుగా లేవివి వాస్తవంలో. ఇవన్నీ చైతన్య మెత్తిన రూపాలే. కాబట్టి చైతన్యాత్మకంగా మాత్ర మివి సత్యమే నిత్యమే. వాటి నలా చూడగలిగితే అంతా ఒకే ఒక ఆత్మ. అది మన స్వరూపమే కాబట్టి మనికిక దేనివల్లా భయం లేదు. విషాదం లేదు. అలా చూడలేకనే ఈ ఉపాధి వర్గం మనకు వేరుగా కనిపించటం. మనమీద దాడి చేయటం. తన్మూలంగా వాటి మార్పు మనకు కలిగే మార్పుగా వాటి వినాశం మన వినాశంగా భావించి భీతి చెందుతున్నాము. ఇదంతా ఆత్మానాత్మలను వివేచన చేయలేని అజ్ఞానం. ఈ అజ్ఞానంతో సాగించాలి మనం సంగ్రామం. సాగిస్తే నరులమైనా మనం విజయులమై ప్రకాశించగలం.