#


Back

Page 28

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


28
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం ॥ 7-13 ॥

అయితే ఇక్కడ ఒక ఆక్షేపణ రావచ్చు. తత్త్వమనేది సర్వత్రా నిండి ఉందని కదా ముందు ప్రతిపాదించారు. అలా సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడది ప్రతివాడి బుద్దికీ స్ఫురించి తీరాలి. ఏ ఒక్కడో దానిని అనుభవించడానికి వీలులేదు. అలాంటప్పుడు నూటికి కోటి కొకడుగా దాని నందుకో లేడని చెప్పే మాట కర్థమేమిటి.

యథార్థమే. తత్త్వమన్ని చోట్లా వ్యాపించి ఉంది. అది ప్రతివాడికీ అనుభవానికి రావలసిందే. కానీ చిత్రమేమంటే రావటాని కవకాశముందే గాని అది రావలసిన అగత్యంలేదు. ఎందుచేతనంటే దానికీ మన బుద్దులకూ మధ్య ఒక పెద్ద అడ్డంకి ఏర్పడవచ్చు. ఎలాంటి ప్రతిబంధ మేర్పడినా అది దాన్ని మనసుకు రానీయదు. అలాంటి ప్రతిబంధకా లేమిటి అని అడిగితే సత్త్వ రజస్తమస్సులనే త్రిగుణాలు. ఈ త్రిగుణాలు పెట్టిన పిల్లలే నామ రూప క్రియలనేవి. పిపీలికాది బ్రహ్మ పర్యంత మీసృష్టినంతా అవేకమ్ముకొనివున్నాయి. అవి ఒకటిపోతే ఒకటి నిత్యమూ మన బుద్దుల నావరించి తత్త్వానికి మనలను దూరం చేస్తున్నాయి. అందుచేత అక్కడే ఉన్నా మనం కండ్లు తెరచి తత్త్వాన్ని చూడలేక పోతున్నాము.

దీనికొక దృష్టాంతం చెబుతాను. ఒక నూతిలో నీళ్ళుంటాయి. ఆ నీటి అడుగు భాగాన ఒక పెద్ద బండ వున్నది. ప్రొద్దస్తమానమూ మనం నీళ్ళు తోడుతూ పోతే ఆ బండ మనకు కనిపించదు. కనిపించదంటే అది అక్కడ లేదనా అర్ధం. ఉంది. అక్కడే ఉంది. ఉన్నా దాని చుట్టూ ఉన్న నీరు కలత చెందుతూ ఉండటం మూలానా అది మన కండ్లకు కనిపించదు. అదే కొంత సేపా నీళ్ళు ఎవరూ తోడకుండా పోతే చాలు. బాగా తేరుకొంటాయి. అలా తేరినప్పుడు పోయి చూచామంటే అడుగున ఉండే బండేకాదు. మనకు గుండు సూదితో సహా దర్శనమిస్తాయి. ఇందుమూలంగా మనం గ్రహించవలసినదేమిటి. ఉపాధుల సంచలనమే పదార్థాన్ని కప్పిపుచ్చి మనకు కనపడకుండా చేస్తుంది. అవి నిశ్చలస్థితికి వస్తే అడ్డుతొలగి పదార్ధం మరలా సాక్షాత్కరిస్తుంది. ప్రస్తుత మీ బ్రహ్మ పదార్ధం కూడా ప్రకృతి గుణాల సంక్షోభం వల్లనే మరుగుపడి పోయింది. దానితో అది ఎక్కడో ఉందని మనం భ్రాంతి పడుతున్నాము. అందుకొవాలని ప్రయత్నిస్తున్నాము. అది అక్కడే వుంది. అయితే నీటి పొరలలాగా త్రిగుణాలనే తెరలు దానికడ్డు తగిలాయి. అందుకే కనపడటం లేదు.