#


Back

Page 26

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


26
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిం ॥ 6-45 ॥

మొత్తం మీద అదేపనిగా ప్రయత్నం చేస్తూ పోతే కొంతకాలానికి శుద్ది అనేది ఏర్పడుతుంది. చిత్తానికి పట్టిన కల్మషం తొలగి పోవటమే శుద్ది. కిల్బిషమంటే ఏమిటది. నిరంతర విషయ చింతన వల్ల మనసుకు కలిగే ఉపరాగం Impression దానిచే ఉపరక్తమైన మనస్సు మసి పట్టిన కాగుమాదిరి తయారవుతుంది. కాగు రాగిదే. కాని ఏమి సుఖం. ఎప్పుడూ నల్లగా కందెనలాగా కనిపిస్తుంటుంది. సహజమైన దాని ఎర్రదనం ఎప్పుడూ మనకు దృగ్గోచరం గాదు. అది ఆ నల్లని మసిపూత క్రిందబడి మటు మాయ మయింది.

అది ఇప్పుడు మరలా తన సహజమైన కాంతితో మనకు కనపడాలంటే దానికి మనం బాగా పులికాపు పెట్టాలి. రెండు చేతులతో పట్టి గట్టిగా తోమాలి. తోమే కొద్గీ నలుపు విరిగి ఎలు పెక్కుతూ వస్తుందది. మన మనసుకు కూడా వచ్చీ పోయి ఇలాంటి తోమకమే పెట్టవలసి ఉంటుంది. పెట్టే కొద్దీ మనసు కూడా వన్నె మారి తన సహజరూపంతో ప్రకాశిస్తుంది.

అంతేకాదు. ఏదైనా ఒక పాత్ర తోమేటప్పుడు చేయి రెండు వైపులా పోతుంది. ఒక వైపే అయితే అది సరిఅయిన తోమకం కాదు. అలాగే మనసును శుద్ది చేసేటప్పుడు కూడా ఇరువైపులా చేయవలసి ఉంటుంది శుద్ది. ఒకటి నేతి అని అనాత్మ దృష్టిని నిరాకరిస్తూ పోవడం. వేరొకటి అలా నిరాకరించినదంతా మరలా మన ఆత్మస్వరూపమేనని అనుసంధానం చేసుకుంటూ రావడం. ఒకటి ప్రసంఖ్యానమనీ - మరొకటి ప్రవిలాపనమనీ చెబుతారు శాస్త్రజ్ఞులు. మొత్తానికీ రెండూ కలిసి శోధనమనే ప్రక్రియను పూర్తిచేస్తాయి. దానితో బాగా పరిశుద్ద మవుతుంది మానవుని మనస్సు. అప్పుడిక దానికి మనసనే పేరు లేదు. అది ఆత్మే అవుతుంది.

అయితే ఇది అంతసులభంగా జరిగే పనిగాదు. ఒక జన్మలో తెమిలే వ్యవహారంకూడా కాదు. దానిని సాధించే లోపల మానవుడనేక జన్మ లెత్తవలసి ఉంటుంది. అలా చెప్పటంలో కూడా ఆశ్చర్యపడనక్కర లేదు. ఎంతో కర్మ మిగిలిపోయే కొంత కర్మవల్ల ప్రస్తుత మీ జన్మ ఏర్పడింది మనకు. ఇందులో మరలా చేస్తూనే ఉన్నాము కర్మ. ఆమిగిలి పోయిందీ ఇదీ కలిసి ఇంకా ఎన్నిజన్మ లివ్వాలో మనకు. అయితే సాధన చేసేకొద్దీ కర్మ కొంత తరిగిపోవచ్చు. సందేహంలేదు. కాని ఏమి సాధన. సముద్రం మాదిరి కర్మ ఉంటే అందులో ఒక బిందువు మాదిరైనా లేదు మనసాధన. ఇలాంటి బిందువు లెన్ని చేరితే సముద్రమయ్యేది.

కనుకనే ఎన్నో జన్మలు పడుతుందని చెప్పటం. ఒక్కొక్క జన్మలో కొంత కొంతపోగు చేస్తూపోతే ఒకానొక జన్మకది కొండలాగా పెరిగిపోతుంది. దానితో అంతవరకూ కొండలాగా పెరిగిన కర్మఅంతా కరిగిపోతుంది. కర్మ పూర్తిగా తొలిగిపోతే ఆ ఖాళీని క్రమంగా జ్ఞానమే ఆక్రమిస్తుంది. అప్పుడు ఇక జన్మలేదు. పునరావృత్తి రహితమైన పదాన్నే మన మందుకోగలం.