#


Back

Page 21

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


21
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ॥ 6-37 ॥

సమత్వ రూపమైన యోగాని కెప్పుడూ సాధకుడు యత్నం చేయాలని చెప్పాము. ఈ యత్నమనే మాట వినేటప్పటికి ఒక సందేహ మేర్పడుతుంది మనకు. యత్న మనేది అందరూ చేయలేరు. మానవులలో ఏ కొందరో దానికి అధికారులు. Competent. కాని అధికారం లేకున్నా శ్రద్దాభక్తులున్న వ్యక్తు లనేకులున్నారు లోకంలో. అడపా దడపా కొంత యత్నం కూడా చేయకపోరు. అయితే అది తీవ్రమైన యత్నం కాకపోవచ్చు. అంత బలమైన యత్నం కాక పోవటం మూలాన యోగమార్గంలో వారికి మాటి మాటికీ మనసు చలించటం కూడా సహజమే. అలాగే జీవితాంతమూ చలిస్తూపోతే ఇక వాడి గతేమిటి. సిద్ధి అనేది ఎప్పుడు అని ప్రశ్న.

నిజంలో యోగం సిద్దించని వాడి గతేమిటని అడగ నక్కరలేదు. వాడిగతి అధోగతేనని ఊరకనే చెప్పవచ్చు, కాని ఇక్కడ సూక్ష్మ మేమంటే వాడికి ప్రయత్నం లేదేగాని, శ్రద్ద ఉన్నది. శ్రద్ద.అనేది కూడా ఒక గొప్ప గుణమే. అది ఉన్నప్పుడేదో ఒక మంచిగతి రావాలే గాని అధోగతి పాలు కాగూడదు మానవుడు.

అయితే అది ఏమిటి- ఎలా ఉంటుందనే విషయం మనంనిర్ణయించేది గాదు. మనమంతా నరులం. నరుడికి కలిగే సంశయం నారాయణుడే తీర్చ వలసి ఉంది. ఎందుకంటే వాడికి భగవంతుడని పేరు. భగమంటే షాడ్గుణ్యం. షాడ్గుణాలలో “భూతానా మాగతిం గతిమ్‌” అని ప్రాణుల రాకపోకల రహస్యం కూడా ఇమిడి ఉంది. అలాంటి రహస్యాలన్నీ తెలిసినవాడు గనుకనే వాడు భగవంతుడు. వాడే కృష్ణ రూపంగా అవతరించాడు కనుక నరుడు వేసిన ప్రశ్నకు ఆ నారాయణుడైన కృష్ణుడే సమాధానం చెప్పాలి. మరొక్కడి కలాంటి అధికారం లేదు. అందులోనూ అతీంద్రియమైన విషయంలో.